యువ ఆటగాడు ఆయుష్ మాత్రే ఫిట్నెస్ విషయంలో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) వ్యవహరించిన తీరును రవిచంద్రన్ అశ్విన్ తీవ్రంగా విమర్శించారు. శనివారం నాటి మ్యాచ్‌లో మాత్రే గాయంతో ఇబ్బంది పడుతున్నప్పటికీ అతడిని బ్యాటింగ్ చేయించడం ‘షాకింగ్’ అని అశ్విన్ అభివర్ణించారు.
అసలేం జరిగింది?
ఈ సీజన్లో అద్భుతంగా రాణిస్తున్న ఆయుష్ మాత్రే, మోకాలికి భారీ కట్టుతో (Knee Strap) బ్యాటింగ్‌కు వచ్చాడు. పవర్‌ప్లే సమయంలో అతను వికెట్ల మధ్య పరిగెడుతూ స్పష్టంగా కుంటుతూ కనిపించాడు. ఫిజియోలు మైదానంలోకి వచ్చి అతడిని పరీక్షించినప్పటికీ, మళ్లీ బ్యాటింగ్ కొనసాగించడానికి అనుమతించారు.
పరిస్థితి మరింత దిగజారింది ఎప్పుడంటే.. మాత్రే నడవడానికే ఇబ్బంది పడుతుంటే, కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ ఒక క్విక్ సింగిల్ కోసం పిలిచాడు. మాత్రే అతి కష్టం మీద ఆ పరుగు పూర్తి చేసి రనౌట్ నుండి తప్పించుకున్నాడు. అయితే, ఆ తర్వాతి బంతికే అతను అవుట్ అయ్యాడు. 17 బంతుల్లో 30 పరుగులు చేసినప్పటికీ, క్రీజులో అతను పడ్డ బాధ అందరినీ కలచివేసింది.
అశ్విన్ ఘాటు విమర్శలు:
తన యూట్యూబ్ ఛానెల్లో అశ్విన్ ఈ విషయంపై స్పందిస్తూ ఇలా అన్నారు:
“ఆయుష్ మాత్రే గాయం చూస్తుంటే అతను చాలా కాలం పాటు ఆటకు దూరం అవుతాడని భయమేస్తోంది. అతను మోకాలికి కట్టుతో బ్యాటింగ్‌కు వచ్చాడు. అతను కేవలం ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఎందుకు వస్తున్నాడని అందరూ అడుగుతున్నారు, అంటే ఫీల్డింగ్ చేయలేకపోవడమే దానికి కారణం.”
రిటైర్డ్ హర్ట్ చేయాల్సింది.. మెడికల్ టీమ్ స్పందనను అశ్విన్ తప్పుబట్టారు. “అతను ఫీల్డింగ్ చేయలేదు కాబట్టి అది కండరాల పట్టేత (Cramp) అయ్యే అవకాశం లేదు. ఒకవేళ అది గాయమే అయితే, ఫిజియోలు పరీక్షించిన తర్వాత కూడా అతను అంత దారుణంగా కుంటుతుంటే.. మళ్ళీ పరుగు తీయమని ఎలా అడుగుతారు? అతడిని రిటైర్డ్ హర్ట్ చేయాల్సింది. వ్యాఖ్యానంలో ఉన్న వారందరూ ఏం జరుగుతుందో చూసి షాక్ అయ్యారు” అని అశ్విన్ అన్నారు.
సిఎస్కే గాయాల నిర్వహణపై విమర్శలు:
సిఎస్కేలో ప్రతి సీజన్లోనూ ఆటగాళ్లు గాయపడటం ఒక అలవాటుగా మారిందని అశ్విన్ ఎద్దేవా చేశారు. దీపక్ చాహర్ ఉదాహరణను ప్రస్తావిస్తూ.. “చాహర్ సిఎస్కే తరపున మూడేళ్లలో కేవలం 16 మ్యాచ్‌లే ఆడాడు. గాయాల నిర్వహణ అనేది సీజన్ ప్రారంభానికి ముందే మొదలవ్వాలి. ప్రతి ఏడాది ఆటగాళ్లు గాయపడితే కొత్త వారిని ఎక్కడ వెతుకుతారు? వారు బజారులో దొరకరు కదా” అని చురకలు అంటించారు.
