ఇటీవలి కాలంలో పూర్తి ఆరోగ్యంగా ఉన్నవారు కూడా హఠాత్తుగా కుప్పకూలిపోవడం, ఆకస్మికంగా మరణించడం లేదా గుండెపోటుకు గురవ్వడం వంటి వార్తలు మనం తరచుగా వింటున్నాము. ముఖ్యంగా గత కొన్నేళ్లుగా యువతలో ఈ సమస్య పెరగడం అందరినీ ఆందోళనకు గురిచేస్తోంది. దేశవ్యాప్తంగా ఇలాంటి వేల కేసులు నమోదవుతున్నాయి.
కర్ణాటకలోని హాసన్ వంటి ప్రాంతాల్లో ఇలాంటి కేసులు పెరగడంపై గతంలో రకరకాల ఊహాగానాలు వినిపించాయి. అయితే, ఈ ఆకస్మిక మరణాలకు అసలు కారణాలేమిటో తెలుసుకోవడానికి నిర్వహించిన తాజా అధ్యయనం కొన్ని కీలక విషయాలను బయటపెట్టింది.
ఆకస్మిక మరణం అంటే ఏమిటి?
వైద్య పరిభాషలో ఆకస్మిక మరణం (Sudden Death) అంటే:
- లక్షణాలు ప్రారంభమైన ఒక గంటలోపు మరణించడం.
- లేదా వ్యక్తి చివరగా ప్రాణంతో కనిపించిన 24 గంటల లోపు మరణించడం.
పరిశోధనలో తేలిన ముఖ్య అంశాలు:
ఇండియన్ జర్నల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్‌లో ప్రచురితమైన AIIMS నూఢిల్లీ కొత్త అధ్యయనం ప్రకారం, సుమారు 2,214 పోస్ట్‌మార్టం నివేదికలను విశ్లేషించారు. అందులో 180 మరణాలు (8.1%) ఆకస్మిక మరణాల కిందకు వచ్చాయి.
- వయస్సు మరియు లింగం: ఆకస్మికంగా మరణించిన వారిలో 57.2% మంది 18 నుండి 45 ఏళ్ల మధ్య వయసు గలవారే. వీరిలో ఎక్కువ మంది పురుషులు కావడం గమనార్హం.
- ప్రధాన కారణం (గుండె సమస్యలు): యువతలో సంభవించే ఆకస్మిక మరణాలలో 42.6% గుండె సంబంధిత సమస్యల వల్లే జరుగుతున్నాయి. ముఖ్యంగా గుండెకు రక్తాన్ని చేరవేసే ధమనులు (Arteries) తీవ్రంగా పూడుకుపోవడం లేదా సన్నబడటం వల్ల ఈ మరణాలు సంభవిస్తున్నాయి.
- శ్వాసకోస సమస్యలు: సుమారు 21.3% మరణాలకు నిమోనియా మరియు క్షయ (TB) వంటి శ్వాసకోస వ్యాధులు కారణమవుతున్నాయి.
- వివరించలేని మరణాలు: మరో 21.3% కేసుల్లో పోస్ట్‌మార్టం తర్వాత కూడా మరణానికి గల ఖచ్చితమైన కారణం పత్తా కాలేదు. వీటిని ‘వివరించలేని మరణాలు’గా వర్గీకరించారు.
ఇతర కారకాలు:
కేవలం వైద్యపరమైన కారణాలే కాకుండా, ఆధునిక జీవనశైలి కూడా ఒక కారణంగా మారుతోంది.
- అధిక మానసిక ఒత్తిడి.
- పొగత్రాగడం మరియు మద్యపానం.
- సరైన అవగాహన లేకుండా జిమ్‌లలో చేసే అతివ్యాయామం.
గతంలో ఈ మరణాలకు కోవిడ్ వ్యాక్సిన్‌తో సంబంధం ఉందని కొన్ని అనుమానాలు వ్యక్తమైనప్పటికీ, తాజా పరిశోధనలో అటువంటి ఆధారాలేవీ లభించలేదు.
