అంతర్జాతీయ క్రికెట్ చరిత్రకు దాదాపు 150 ఏళ్ల చరిత్ర ఉంది. ఈ సుదీర్ఘ ప్రయాణంలో ఎన్నో అద్భుత క్షణాలు ఉన్నప్పటికీ, కొన్ని సంఘటనలు మాత్రం ఈ ఆటను అవమానపరిచాయి. స్టేడియంలో గొడవలు, ఫిక్సింగ్ వంటి సంఘటనలు క్రికెట్ ప్రతిష్టను దెబ్బతీశాయి. సరిగ్గా 8 ఏళ్ల క్రితం మార్చి 24న కేప్‌టౌన్ మైదానంలో ఆస్ట్రేలియా కెప్టెన్ చేసిన ఒక పని ప్రపంచాన్నే విస్మయానికి గురిచేసింది. అదే ‘శాండ్‌పేపర్’ ఉదంతం.
దక్షిణాఫ్రికా మరియు ఆస్ట్రేలియా మధ్య జరిగిన టెస్ట్ సిరీస్‌లో మూడవ మ్యాచ్ సందర్భంగా ఈ ఘటన జరిగింది. ఆ సిరీస్‌లో అప్పటికే రెండు జట్ల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. అయితే, మూడవ రోజు న్యూలాండ్స్ స్టేడియం స్క్రీన్‌పై కనిపించిన ఒక వీడియో క్రీడా ప్రపంచాన్ని షాక్‌కు గురిచేసింది.
బాన్‌క్రాఫ్ట్-స్మిత్-వార్నర్ దారుణమైన ప్లాన్: దక్షిణాఫ్రికా బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ఆస్ట్రేలియాకు వికెట్లు అవసరమయ్యాయి. అప్పుడే కెమెరా కళ్లు ఆస్ట్రేలియా ఆటగాడు కామెరాన్ బాన్‌క్రాఫ్ట్‌ను బంధించాయి. అతను తన జేబులో నుండి ఒక వస్తువును తీసి బంతిపై రుద్దుతూ కనిపించాడు. అది స్క్రీన్‌పై కనిపించగానే ఆ వస్తువును తన ప్యాంట్ లోపల దాచుకున్నాడు. అంపైర్లు దీనిపై ఆరా తీయగా, అది ‘శాండ్‌పేపర్’ అని తేలింది. బంతిని రుద్ది పాతదిగా చేయడం ద్వారా రివర్స్ స్వింగ్ రాబట్టాలనేది వారి ప్లాన్.
ఆ రోజు ఆట ముగిసిన తర్వాత కెప్టెన్ స్టీవ్ స్మిత్, బాన్‌క్రాఫ్ట్ మీడియా ముందుకు వచ్చి తమ తప్పును అంగీకరించారు. లంచ్ బ్రేక్ సమయంలో తమ ‘లీడర్షిప్ గ్రూప్’ (స్మిత్ మరియు వైస్ కెప్టెన్ డేవిడ్ వార్నర్) కు ఈ విషయం తెలుసని, కావాలనే ప్లాన్ ప్రకారం చేశామని ఒప్పుకున్నారు.
క్రికెట్ ఆస్ట్రేలియా కఠిన చర్యలు: బంతి ఆకారాన్ని మార్చడం (Ball Tampering) నేరం కావడం, అది కూడా ఒక ప్రణాళిక ప్రకారం చేయడం క్రికెట్ ప్రపంచంలో తుఫాను సృష్టించింది. వెంటనే స్పందించిన క్రికెట్ ఆస్ట్రేలియా, ముగ్గురు ఆటగాళ్లను సిరీస్ మధ్యలోనే స్వదేశానికి పిలిపించింది. స్మిత్, వార్నర్‌లపై ఏడాది పాటు, బాన్‌క్రాఫ్ట్‌పై 9 నెలల పాటు నిషేధం విధించింది. టీమ్ పైన్ జట్టు పగ్గాలను చేపట్టాడు. 2019లో వీరు తిరిగి జట్టులోకి వచ్చినప్పటికీ, బాన్‌క్రాఫ్ట్ ఎక్కువ కాలం కొనసాగలేకపోయాడు. వార్నర్ రిటైర్మెంట్ వరకు ఆడగా, స్మిత్ ఇప్పటికీ జట్టులో కొనసాగుతున్నాడు.
