షాడోల్: రీల్ లైఫ్‌కు, రియల్ లైఫ్‌కు మధ్య ఒక్కోసారి ఆకాశానికి, భూమికి ఉన్నంత తేడా ఉంటుంది. సోషల్ మీడియాలో కనిపించే తళుకుబెళుకులు, లగ్జరీ లైఫ్ స్టైల్‌ను చూసి గుడ్డిగా నమ్మితే ఎంతటి ప్రమాదమో తెలిపే ఘటనే ఇది. ఇన్స్టాగ్రామ్ బిల్డప్‌లు చూసి మోసపోయిన ఓ యువతికి.. తన ప్రియుడు ఒక సాధారణ పెయింటర్ (పుతాయ్ వాలా) అని తెలియడంతో నోరెళ్లబెట్టాల్సిన పరిస్థితి వచ్చింది.
పోలీసుల కథనం ప్రకారం.. మధ్యప్రదేశ్ రాష్ట్రం షాడోల్ జిల్లా జైత్పూర్ ప్రాంతానికి చెందిన 18 ఏళ్ల యువతి కాలేజీలో ఫస్ట్ ఇయర్ చదువుతోంది. కొంతకాలంగా ఆమెకు ఇన్స్టాగ్రామ్ ద్వారా గ్వాలియర్‌కు చెందిన కరణ్ అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. ఇన్‌స్టాగ్రామ్‌లో మొదలైన వీరి పరిచయం కాస్తా కొద్దిరోజుల్లోనే ప్రేమగా మారింది. అయితే, కరణ్ తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో పెద్ద పెద్ద లగ్జరీ బంగళాలు, విలాసవంతమైన ఇళ్ల ముందు దిగిన ఫోటోలను పోస్ట్ చేస్తూ తాను పెద్ద రిచ్ కిడ్ అన్నట్లు బిల్డప్ ఇచ్చేవాడు. అది నిజమేనని నమ్మిన సదరు విద్యార్థిని అతని ప్రేమవలలో పడిపోయింది.
సస్పెన్స్ సినిమాను తలపించేలా ప్లాన్:
తనను నమ్మించిన ప్రియుడి కోసం ఆ యువతి ఇల్లు వదిలి పారిపోవడానికి సిద్ధపడింది. దీనికోసం కరణ్ గ్వాలియర్ నుండి మొదట షాడోల్ చేరుకున్నాడు. అక్కడి నుండి బస్సులో బుఢార్, ఆపై ఆటోలో జైత్పూర్ చేరుకుని యువతిని కలుసుకున్నాడు. ఇద్దరూ కలిసి అక్కడి నుండి పారిపోయారు. యువతి అకస్మాత్తుగా అదృశ్యం కావడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు గత జూన్ 6న (2026) జైత్పూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులకు.. బాలిక గ్వాలియర్‌కు చెందిన కరణ్ అనే యువకుడితో టచ్‌లో ఉన్నట్లు లీడ్ దొరికింది. మరింత లోతుగా కాల్ డేటా, లొకేషన్ ట్రాక్ చేయగా ఇద్దరూ గ్వాలియర్‌లో ఉన్నట్లు తేలింది. పోలీసుల బృందం మొదట గ్వాలియర్ వెళ్లి, అక్కడి నుండి మురేనాకు చేరుకుంది. అక్కడ ఉన్న యువకుడి మేనమామ ఇంట్లో దాక్కున్న యువతిని పోలీసులు సురక్షితంగా స్వాధీనం చేసుకున్నారు.
ఫోటోల వెనుక అసలు నిజం ఇదీ!
పోలీసుల విచారణలో అసలు నిజం తెలిసి సదరు విద్యార్థిని షాక్‌కు గురైంది. కరణ్ తానొక పెద్ద ధనవంతుడిగా చెప్పుకోవడానికి ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన పెద్ద పెద్ద బంగళాల ఫోటోలన్నీ.. నిజానికి అతను రోజువారీ కూలీగా ఇళ్లకు పుట్టీ, పెయింటింగ్ (సున్నాలు వేసే) పని చేయడానికి వెళ్లిన చోట దిగినవని తేలింది. తను పని చేసే లగ్జరీ ఇళ్లనే తన ఇళ్లుగా చూపిస్తూ ఆ అమ్మాయిని నమ్మించాడు. కాగా, యువతిని మేనమామ ఇంట్లో వదిలేసి నిందితుడైన కరణ్ ప్రస్తుతం పరారయ్యాడు. పోలీసులు కేసు నమోదు చేసి అతని కోసం గాలిస్తున్నారు.
