“ఆ మూగజీవి చేసిన పాపం ఇంటి ముందు నిలబడటమేనా?!” — ఇనుప రాడ్డుతో ఆవును విచక్షణారహితంగా కొట్టిన వ్యక్తి బండారం బట్టబయలు!

ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో, వీధిలో ప్రశాంతంగా నిలబడి ఉన్న ఓ ఆవును ఇనుప రాడ్డుతో అత్యంత క్రూరంగా కొట్టి హింసించిన ఘటనకు సంబంధించిన సీసీటీవీ (CCTV) దృశ్యాలు బయటకు వచ్చి స్థానికంగా తీవ్ర ఆగ్రహావేశాలకు కారణమయ్యాయి.

‘ప్రదీప్ బాబా’గా పిలవబడే ఓ వ్యక్తి.. ఇంటి ముందు వీధి ఓరగా నిలబడి ఉన్న ఆవుపై ఎలాంటి కారణం లేకుండానే ఒక్కసారిగా దాడికి పాల్పడ్డాడు. ఇనుప రాడ్డుతో ఆ మూగజీవిని కనికరం లేకుండా వరుసపెట్టి కొట్టడంతో, నొప్పి భరించలేక ఆ ఆవు అరుస్తూ విలవిలలాడిన దృశ్యాలు చూసేవారి గుండెలను కలిచివేస్తున్నాయి.

ఈ దారుణ ఘటన అక్కడ అమర్చిన సీసీటీవీ కెమెరాలో స్పష్టంగా రికార్డు కాగా, ఆ వీడియో సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అయింది. పవిత్ర నగరమైన వారణాసిలో, అదీ సాధువు ముసుగులో తిరిగే ఓ వ్యక్తి గోవుపై ఇంతటి క్రూరమైన దాడికి పాల్పడటం చూసి జంతు ప్రేమికులు, సాధారణ ప్రజలు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.

ఈ వీడియో చూసి ఆగ్రహంతో ఊగిపోయిన ప్రజలు, నిందితుడిపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ వారణాసి పోలీసులకు పెద్ద ఎత్తున ఫిర్యాదులు చేశారు. వీడియో ఆధారాలు, ప్రజల ఫిర్యాదులతో వెంటనే స్పందించిన వారణాసి పోలీసులు.. జంతు హింస నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా దాడికి పాల్పడిన ‘ప్రదీప్ బాబా’ను గుర్తించిన పోలీసులు, అతడిని అరెస్టు చేసి జైలుకు తరలించారు. మూగజీవిపై జరిగిన ఈ దాష్టీకం, ఆ వెంటనే పోలీసులు తీసుకున్న వేగవంతమైన చర్య వారణాసిలో చర్చనీయాంశంగా మారడంతో పాటు జంతు ప్రేమికులకు ఊరటనిచ్చింది.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *