సోషల్ మీడియాలో కొన్ని క్షణాల లైక్స్, వ్యూస్ మరియు ఫేమ్ కోసం యువత తమ విలువైన ప్రాణాలను పణంగా పెడుతున్న పిచ్చి చేష్టలు రోజురోజుకూ మితిమీరిపోతున్నాయి.
ఈ క్రమంలోనే, వేగంగా వస్తున్న రైలును కూడా లెక్కచేయకుండా ఇద్దరు యువకులు రైల్వే పట్టాలపై కూర్చుని అత్యంత ప్రమాదకరంగా రీల్స్ వీడియో షూట్ చేసుకుంటున్న సంఘటన తీవ్ర కలకలం రేపింది.
అదే ట్రాక్‌పై వేగంగా వస్తున్న రైలు లోకో పైలట్ (డ్రైవర్).. పట్టాలపై కూర్చున్న యువకులను దూరంగా ఉండగానే గమనించాడు. క్షణం కూడా ఆలస్యం చేయకుండా వెంటనే ఎమర్జెన్సీ బ్రేకులు వేసి రైలును సరైన సమయానికి నిలిపివేశాడు. లోకో పైలట్ చూపిన అద్భుతమైన సమయస్ఫూర్తితో.. ఆ ఇద్దరు యువకులు మృత్యువు అంచుల నుంచి వెంట్రుకవాసిలో ప్రాణాలతో బయటపడ్డారు.
సకాలంలో స్పందించి ప్రాణాలు కాపాడిన లోకో పైలట్‌ను నెటిజన్లు ప్రశంసిస్తుండగా.. కేవలం రీల్స్ పిచ్చితో తమ ప్రాణాలతో పాటు రైలులోని వందలాది మంది ప్రయాణికుల భద్రతను ప్రమాదంలోకి నెట్టిన ఆ పోకిరీలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఘటనపై రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
