లక్నో: “మేనేజర్ గారూ, నాకున్న ఈ 12 ఎఫ్డీలను (FD) ఇప్పుడే రద్దు చేయండి. నా సేవింగ్స్ అకౌంట్లో ఉన్న మొత్తం డబ్బుతో కలిపి ఈ ఖాతాకు బదిలీ చేయండి.” 75 ఏళ్ల వృద్ధురాలు ఈ మాటలు చెబుతున్నప్పుడు ఆమె చేతులు, పెదవులు రెండూ వణుకుతున్నాయి.
ఆమె మాటల్లో ఒక తెలియని తొందర, భయం, ఆందోళన కనిపిస్తున్నాయి. లక్నోలోని పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) మామా చౌరస్తా శాఖ మేనేజర్ తన కళ్ళద్దాలు సరిచేసుకుంటూ.. “అమ్మా, రూ. 1.13 కోట్ల భారీ మొత్తం ఒక్కసారిగా బదిలీ చేస్తున్నారా? అంతా క్షేమమేనా? పిల్లల కోసం కావాలా?” అని అడిగారు. ఆ వృద్ధురాలు చూపులు తప్పిస్తూ, “అవును.. పిల్లల కోసమే. మీరు ప్రశ్నలు అడగకండి, త్వరగా ప్రాసెస్ మొదలుపెట్టండి” అని అడిగారు. ఇక్కడే ఆ బ్యాంక్ సిబ్బంది అప్రమత్తత ఒక పెను ప్రమాదాన్ని తప్పించింది.
మూడు గంటల కౌన్సెలింగ్ – పెరిగిన అనుమానం: డిసెంబర్ 15 ఉదయం ఆ వృద్ధురాలు బ్యాంకుకు వచ్చిన తీరు సిబ్బందికి అనుమానం కలిగించింది. మేనేజర్ ఆమెకు టీ ఆఫర్ చేసి మాటల్లో పెట్టారు. ఎఫ్డీలు మధ్యలోనే రద్దు చేస్తే నష్టం వస్తుందని వివరించారు. ఈలోగా సిబ్బంది ఆమె కొడుకు ఫోన్ నంబర్ అడగగా, ఆమె ఇవ్వడానికి నిరాకరించారు. దీంతో అనుమానం బలపడి, బ్యాంక్ రికార్డుల్లో ఉన్న నామినీ (ఆమె కొడుకు) నంబర్‌కు ఫోన్ చేశారు. “మాకు కారు కొనడానికి కొద్దిగా డబ్బు కావాలని అడిగిన మాట నిజమే కానీ, ఇంత పెద్ద మొత్తం మాకు అక్కర్లేదు. అమ్మ ఎందుకు అంత డబ్బు పంపిస్తుందో మాకు తెలియదు” అని కొడుకు సమాధానమిచ్చాడు.
చాటింగ్‌లో అసలు నిజం: ఆమె పదే పదే బయటకు వెళ్లి ఫోన్ మాట్లాడుతుండటం సిబ్బంది గమనించారు. వివరాలు వెరిఫై చేస్తామని చెప్పి చాకచక్యంగా ఆమె ఫోన్ తీసుకున్నారు. వాట్సాప్ ఓపెన్ చేసి చూడగా సిబ్బంది విస్తుపోయారు. గుర్తుతెలియని నంబర్ల నుండి వచ్చిన వాయిస్ నోట్స్, మెసేజ్‌లలో ఆమెను భయంకరంగా బెదిరిస్తున్నారు. వెంటనే పోలీసులు అక్కడికి చేరుకుని కౌన్సెలింగ్ ఇవ్వడంతో ఆమె భోరున విలపించారు.
4 రోజుల పాటు ‘డిజిటల్ అరెస్ట్’: తాను డిసెంబర్ 11 నుండి ‘డిజిటల్ అరెస్ట్’ లో ఉన్నట్లు ఆమె వివరించారు.
- మోసం: తనకు సిబిఐ (CBI) అధికారులమని ఫోన్ వచ్చిందని, తన దివంగత భర్త ఆధార్ కార్డు, మొబైల్ నంబర్ రూ. 50 కోట్ల మనీలాండరింగ్ మరియు ఉగ్రవాద నిధుల కోసం వాడారని బెదిరించారు.
- బెదిరింపు: వాట్సాప్ వీడియో కాల్లో యూనిఫాం ధరించిన వ్యక్తులను చూపించి, డబ్బును ‘సేఫ్ అకౌంట్’కు పంపకపోతే తన కుటుంబాన్ని చంపేస్తామని భయపెట్టారు. ఇంటి నుండి బయటకు రావద్దని, ఎవరికీ చెప్పవద్దని ఆజ్ఞాపించారు.
ప్రశంసల జల్లు: లక్నో డీసీపీ శశాంక్ సింగ్ బ్యాంక్ సిబ్బందిని మనసారా అభినందించారు. ఒకవేళ ఆ మేనేజర్ కేవలం తన పని చూసుకుని ఉంటే, ఈరోజు ఆ కుటుంబం రోడ్డున పడేదని అన్నారు. 3 గంటల పాటు ఓపికగా ఆమెతో మాట్లాడి, రూ. 1.13 కోట్లను కాపాడిన బ్యాంక్ అధికారుల సమయస్ఫూర్తిని అందరూ కొనియాడుతున్నారు.
