“ఆ 18 ఏళ్ల అబ్బాయే కావాలి!” అని పట్టుబట్టిన 13 ఏళ్ల బాలిక.. అట్టహాసంగా పెళ్లి.. 26 రోజులకే పుట్టింట్లో ఆత్మహత్య..!!

ఉత్తరప్రదేశ్: ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీ సమీపంలోని ఒక గ్రామంలో, తన ప్రేమికుడిని వివాహం చేసుకున్న 13 ఏళ్ల బాలిక, పెళ్లయిన 26 రోజులకే విషం తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆ ప్రాంతంలో తీవ్ర విషాదాన్ని నింపింది.

ఆ బాలిక తన అక్క ఇంటికి వెళ్ళినప్పుడు, వివేక్ (18) అనే యువకుడితో పరిచయం ఏర్పడి, అది ప్రేమగా మారింది. బాలిక ప్రేమను కుటుంబ సభ్యులు మొదట వ్యతిరేకించినప్పటికీ, ఆమె మొండిగా పట్టుబట్టడంతో గత నెలలో ఇద్దరికీ వివాహం జరిపించారు. వివాహం తర్వాత తన భర్తతో కలిసి పుట్టింటికి వచ్చిన ఆ బాలిక, హఠాత్తుగా విషం తాగింది. ప్రమాదకర స్థితిలో ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మరణించింది.

ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు విచారణ చేపట్టగా షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. బాలిక మరణ సమయంలో, ఆమెకు 18 ఏళ్లు నిండాయని కుటుంబ సభ్యులు పోలీసులకు చెప్పారు. కానీ పోలీసులకు అనుమానం వచ్చి, బాలిక గుర్తింపు కార్డును పరిశీలించగా, ఆమె వయసు కేవలం 13 ఏళ్లు మాత్రమేనని తేలింది.

ఈ ఘటనపై బాలిక భర్త వివేక్ స్పందిస్తూ, గత ఏడాది బాలిక తండ్రి మరణించడంతో ఆమె తీవ్ర మానసిక వేదనలో ఉందని, తరచూ తండ్రి గురించి మాట్లాడేదని తెలిపాడు. కుటుంబ సభ్యుల నుండి ఎటువంటి ఫిర్యాదు అందకపోయినప్పటికీ, ఆత్మహత్య చేసుకున్నది మైనర్ బాలిక కావడంతో, పోలీసులు కేసు నమోదు చేసి లోతైన విచారణ జరుపుతున్నారు.


Posted

in

by

Tags: