ఉత్తరప్రదేశ్ రాష్ట్రం గ్రేటర్ నోయిడాలో 6 ఏళ్ల చిన్నారి దారుణ హత్యకు గురైన ఘటన తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది.
హల్దోని గ్రామానికి చెందిన ఆ చిన్నారి అదృశ్యమవడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు. దర్యాప్తులో భాగంగా ఆ ప్రాంతంలోని సీసీటీవీ దృశ్యాలను క్షుణ్ణంగా పరిశీలించగా, ఆ ఫుటేజ్ పోలీసులకు కీలక ఆధారంగా మారింది. సీసీటీవీ దృశ్యాలు మరియు ఇతర సమాచారం ఆధారంగా అనుమానితుడిని గుర్తించిన పోలీసులు అతడిని పట్టుకునేందుకు వల పన్నారు.
పోలీసుల విచారణలో ఆ దారుణానికి పాల్పడింది బలరాజ్ అనే వ్యక్తిగా తేలింది. నిందితుడు చిన్నారిపై అత్యంత పాశవికంగా అత్యాచారానికి ఒడిగట్టి, అనంతరం హత్య చేసి మృతదేహాన్ని గోనెసంచిలో కట్టి ఎత్తుకెళ్లినట్లు వెల్లడైంది. నేరం జరిగిన 24 గంటల వ్యవధిలోనే పోలీసులు నిందితుడిని చుట్టుముట్టారు. అయితే, ఆ సమయంలో నిందితుడు తన వద్ద ఉన్న తుపాకీతో పోలీసులపైకి కాల్పులు జరపడానికి ప్రయత్నించడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. దీంతో ఆత్మరక్షణ కోసం పోలీసులు ఎదురుకాల్పులు జరిపి ఆ కిరాతకుడిని కాల్చి అదుపులోకి తీసుకున్నారు.
ఈ అమానుష ఘటన స్థానికంగా తీవ్ర ఆగ్రహావేశాలకు దారితీసింది. ఆ కామాంధుడికి కఠినాతి కఠినమైన శిక్ష విధించాలని స్థానికులు ముక్తకంఠంతో డిమాండ్ చేస్తున్నారు. ఈ కేసుకు సంబంధించిన వీడియో దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ తీవ్ర కలకలం రేపుతున్నాయి.

Leave a Reply