రక్త నాళాల్లో (నరాల్లో) బ్లాకేజ్ ఉండటం ఆరోగ్యానికి చాలా ప్రమాదకరం. చాలా మందికి ఈ బ్లాకేజ్ గురించి ముందుగా తెలియదు. పరిస్థితి విషమించి డాక్టర్ వద్దకు వెళ్ళి టెస్టులు చేయించుకున్నప్పుడే ఇది బయటపడుతుంది.
శరీరంలోని రక్త నాళాల్లో బ్లాకేజ్ ఉంటే, రక్తం సరఫరా సరిగ్గా జరగడం లేదని అర్థం. దీనివల్ల గుండెపోటు (Heart Attack), స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఉంది. సమయం మించిపోకముందే వీటిని గుర్తించడం ముఖ్యం. సాధారణంగా ఎటువంటి సమస్య లేనప్పుడు ఎవరూ డాక్టర్ వద్దకు వెళ్లి టెస్టులు చేయించుకోవడానికి ఇష్టపడరు. అలాంటి వారికి ఇంట్లో ఉండే బీపీ మిషన్ ద్వారా బ్లాకేజ్ తనిఖీ చేసే ఈ పద్ధతి ఎంతగానో సహాయపడుతుంది.
ఏమిటీ పరీక్ష?
ఈ పరీక్షను యాంకిల్ బ్రాకియల్ ఇండెక్స్ (ABI – Ankle Brachial Index) అంటారు. దీనిని ఇంట్లోనే సులభంగా ఎలా చేయాలో డాక్టర్ వివరించారు.
బీపీ మిషన్‌తో బ్లాకేజ్ ఎలా తనిఖీ చేయాలి?
- మొదటి దశ: సాధారణంగా మనం బీపీని ఎలా కొలుస్తామో అలాగే మీ చేతి (Arm) పై భాగంలో బీపీ మిషన్ కఫ్‌ను అమర్చి రీడింగ్ తీసుకోండి.
- రెండవ దశ: ఇప్పుడు అదే మిషన్ కఫ్‌ను మీ కాలి మడమ (Ankle – పాదం, కాలు కలిసే చోటు) పైన అమర్చి అక్కడ కూడా బీపీని కొలవండి.
- మూడవ దశ: రెండు చోట్లా వచ్చిన సిస్టోలిక్ (Systolic) ప్రెజర్ రీడింగ్‌ను మాత్రమే తీసుకోవాలి (అంటే పై రీడింగ్; ఉదాహరణకు బీపీ 120/80 ఉంటే, అందులో 120ని తీసుకోవాలి).
లెక్కించే విధానం:
కాలి మడమ వద్ద వచ్చిన బీపీ రీడింగ్‌ను, చేతి వద్ద వచ్చిన బీపీ రీడింగ్‌తో భాగించాలి.
సూత్రం: ABI = కాలి మడమ వద్ద సిస్టోలిక్ బీపీ/ చేతి వద్ద సిస్టోలిక్ బీపీ
రీడింగ్ ద్వారా ఫలితాన్ని ఇలా అర్థం చేసుకోండి:
- 1 కి దగ్గరగా ఉంటే: నరాల్లో ఎటువంటి బ్లాకేజ్ లేదని, అవి ఆరోగ్యంగా ఉన్నాయని అర్థం.
- 0.9 కంటే తక్కువ వస్తే: నరాల్లో బ్లాకేజ్ ఉండే ప్రమాదం ఉందని సూచన.
- 1.4 కంటే ఎక్కువ వస్తే: రక్త నాళాలు తమ స్థితిస్థాపకతను (Flexibility) కోల్పోయి, మొద్దుబారిపోయాయని (Stiff) అర్థం.
రీడింగ్ మరీ తక్కువగా ఉన్నా లేదా ఎక్కువగా ఉన్నా వెంటనే డాక్టర్‌ను సంప్రదించి మరిన్ని పరీక్షలు చేయించుకోవడం మంచిది.
