ఇండియా ముందు మోకారిల్లి, అమెరికాకు తాకట్టు పెట్టేశారు..! “ఇజ్రాయెల్ కోసం రహస్య ఒప్పందం”.. పాకిస్తాన్ దగ్గర ఏమీ లేదు.. అసీమ్ మునీర్‌ను చీల్చి చెండాడిన ఇమ్రాన్ ఖాన్ సోదరి..!

పాకిస్తాన్ రాజకీయాల్లో మరోసారి పెద్ద రాజకీయ తుఫాను చెలరేగింది. జైల్లో ఉన్న ఆ దేశ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సోదరి నూరీన్ నియాజీ విడుదల చేసిన సంచలన ప్రకటన పాకిస్తాన్ సైన్యాన్ని నేరుగా బోనులో నిలబెట్టింది.

గతేడాది భారతదేశం చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’ చర్య తర్వాత, పాకిస్తాన్ సైన్యం తన ఓటమిని దాచడానికి ప్రజల్లో ఒక నకిలీ విజయ గాథను అల్లుతోందని ఆమె బహిరంగంగా ఆరోపించారు. ఈ వ్యవహారం పాకిస్తాన్ పాలక వర్గాల్లో తీవ్ర వణుకు పుట్టించిందని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, పాకిస్తాన్ సైన్యాధ్యక్షుడు జనరల్ అసీమ్ మునీర్, ఇజ్రాయెల్‌లను లక్ష్యంగా చేసుకుని నూరీన్ నియాజీ పలు దిగ్భ్రాంతికరమైన ఆరోపణలను గుప్పించారు. ఇండియాతో ఉద్రిక్తతలు నడుస్తున్న సమయంలో, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ జోక్యం చేసుకుని పాకిస్తాన్‌కు తాత్కాలిక ఉపశమనం కలిగించారని పేర్కొన్న ఆమె.. దీనికి ప్రతిఫలంగా పాకిస్తాన్ సైన్యాధ్యక్షుడు అసీమ్ మునీర్ దేశాన్ని అమెరికాకు తాకట్టు పెట్టేశారని విమర్శించారు. అంతేకాకుండా, ‘అబ్రహం ఒప్పందం’లో చేరి ఇజ్రాయెల్‌ను ఒక ప్రత్యేక దేశంగా పాకిస్తాన్ గుర్తిస్తుందనే రహస్య వ్యూహాత్మక హామీని కూడా అసీమ్ మునీర్ అమెరికాకు ఇచ్చారని ఆమె ఆరోపించారు.

భారత, పాకిస్తాన్ సైన్యాల బలాబలాలను పోల్చి మాట్లాడిన నూరీన్.. సాంకేతికత, ఆర్థిక వ్యవస్థ మరియు సాంప్రదాయ సైనిక బలం ఇలా అన్నింటిలోనూ భారత సైన్యం పాకిస్తాన్ కంటే ఎన్నో రెట్లు ముందుందని అంగీకరించారు. గత ‘ఆపరేషన్ సిందూర్’ దాడి సమయంలో, భారతదేశానికి చెందిన బ్రహ్మోస్ క్షిపణులు పాకిస్తాన్‌కు చెందిన పలు సైనిక స్థావరాలను పూర్తిగా నామరూపాలు లేకుండా చేశాయని, కేవలం 88 గంటల్లోనే మొత్తం వైమానిక పరిధిని ఇండియా తన నియంత్రణలోకి తెచ్చుకుందని ఇంటెలిజెన్స్ డేటా చూపిస్తోందని ఆమె నొక్కి చెప్పారు. ఈ ఘోర ఓటమి నుండి ప్రజల దృష్టిని మళ్లించడానికే సైన్యం నకిలీ ప్రచారాలు చేస్తోందనేది ఆమె ఆరోపణ.

ఇంతటి ఘోరమైన యుద్ధ ఓటమి తర్వాత కూడా, పాకిస్తాన్ సైన్యాధ్యక్షుడు జనరల్ అసీమ్ మునీర్ తనను తాను ‘ఫీల్డ్ మార్షల్’ అనే అత్యున్నత పదవికి ప్రమోట్ చేసుకోవడం హాస్యాస్పదమని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. అణుఆయుధ దేశమైన పాకిస్తాన్, ఒక సాంప్రదాయ యుద్ధంలో భారతదేశాన్ని ఓడించలేదనే చేదు నిజాన్ని ప్రస్తుత అధికార మార్పు స్పష్టం చేసిందని నూరీన్ పేర్కొన్నారు. దేశ ప్రజలను మోసం చేసి ప్రశాంతంగా ఉంచడానికే సైనిక నాయకత్వం విజయ గాథలను సృష్టిస్తోందని చెబుతూ ఆమె తన ప్రకటనను ముగించారు.


Posted

in

by

Tags: