ఇండోనేషియా సముద్రంలో వింత జీవి.. ప్రపంచమే ఆశ్చర్యపోయేలా 40 కోట్ల ఏళ్ల నాటి మర్మం వీడింది!

ప్రపంచం ప్రస్తుతం ఒక అద్భుత ఆవిష్కరణను చూసి నివ్వెరపోతోంది. కొన్ని కోట్ల ఏళ్ల క్రితం, అంటే ఈ భూమిపై డైనోసార్లు పుట్టకముందే నివసించిన ఒక విచిత్రమైన చేప జాతి ఇప్పటికీ ప్రాణాలతో ఉన్నట్లు కనుగొన్నారు. సముద్ర గర్భంలో రహస్యంగా తిరుగుతున్న ఈ చేపకు పరిశోధకులు “సీలకాంత్” (Coelacanth) అని పేరు పెట్టారు. దీనికి సంబంధించిన సంచలన వీడియో ఆధారాలు తాజాగా ఇండోనేషియా నుండి వెలువడ్డాయి.

చాలా కాలం క్రితమే ఈ చేప జాతి పూర్తిగా అంతరించిపోయిందని శాస్త్రవేత్తలు నమ్మేవారు. అయితే, 1938లో దక్షిణ ఆఫ్రికాలో మార్జోరీ కోర్టెనే దీనిని మొదటిసారి ప్రాణాలతో చూశారు. ఆ తర్వాత జె.ఎల్.బి. స్మిత్ దీని శాస్త్రీయ రహస్యాలను ప్రపంచానికి తెలియజేశారు. అందుకే దీనిని “లివింగ్ ఫాసిల్” (సజీవ శిలాజం) అని పిలుస్తారు.

ఇండోనేషియా సముద్ర రహస్యం: ప్రస్తుతం ఇండోనేషియాలోని ‘బంగాయ్’ ద్వీప సముద్ర ప్రాంతంలో దీనికి సంబంధించిన వీడియో ఆధారాలు లభించాయి. ఫ్రెంచ్ దేశానికి చెందిన లారెంట్ బలెస్టా నేతృత్వంలోని డైవర్ల బృందం సుమారు 145 మీటర్ల లోతులో పరిశోధనలు చేస్తుండగా.. సూర్యరశ్మి కూడా చొరబడలేని చీకటి ప్రాంతంలో, రాళ్ల మధ్య ఒక భారీ సీలకాంత్ చేప ఈదడాన్ని చూసి వారు విస్తుపోయారు. మెల్లగా దాని దగ్గరకు వెళ్లి వారు వీడియో రికార్డ్ చేశారు.

కాళ్లు ఉన్న వింత చేప: ఈ చేప సాధారణ చేపలలా ఉండదు. దీని శరీర నిర్మాణం చాలా విచిత్రంగా ఉంటుంది. ఇతర చేపలకు రెక్కల వంటి సన్నని మొప్పలు ఉంటే, ఈ చేపకు కాళ్లలాంటి 8 మందపాటి మొప్పలు ఉన్నాయి. ఇవి చూడటానికి చేపకు కాళ్లు మొలిచినట్లుగా కనిపిస్తాయి. ఈ మొప్పల సాయంతో సముద్రం అడుగు భాగంలో మెల్లగా నడుస్తున్నట్లుగా ఇది ఈదుతుంది. సుమారు 2 మీటర్ల పొడవు వరకు పెరిగే ఈ చేప శరీరం అంతా రాయిలాంటి గట్టి పొలుసులతో ఉంటుంది.

సజీవ శిలాజం: కోట్ల ఏళ్ల క్రితం సముద్రంలో నివసించిన జీవులు కాలక్రమేణా అంతరించిపోయాయి. కానీ ఇన్ని కోట్ల సంవత్సరాలుగా భూమిపై ఎన్ని మార్పులు జరిగినా, ఈ చేప మాత్రం తన రూపాన్ని మార్చుకోకుండా అలాగే ఉండటమే ఇందులో ఉన్న పెద్ద రహస్యం. అందుకే దీనిని శాస్త్రవేత్తలు సగర్వంగా “సజీవ శిలాజం” అని పిలుస్తారు. ఈ వీడియో ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వైరల్ అవుతోంది. సముద్ర గర్భంలో ఇంకా ఎన్నెన్ని రహస్యాలు దాగి ఉన్నాయో ఈ ఆవిష్కరణ మరోసారి నిరూపించింది.


Posted

in

by

Tags: