మధురై జిల్లా ఉసిలంపట్టి సమీపంలోని పేయంపట్టి గ్రామానికి చెందిన మునియమ్మాళ్ అనే వృద్ధురాలు, తాను వినియోగిస్తున్న ఉమ్మడి దారిని అదే ప్రాంతానికి చెందిన కొందరు ఆక్రమించి ముళ్ల కంచె వేశారని ఆరోపిస్తూ ఆందోళనకు దిగింది.
దారి మూసుకుపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడిన ఆ వృద్ధురాలు, అధికారుల నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ నేరుగా ఉసిలంపట్టి తహసీల్దార్ కార్యాలయానికి చేరుకుంది. తన వెంట తెచ్చుకున్న చాప, దిండుతో ఆఫీసు గుమ్మం ముందే పడుకుని నిద్రపోతూ వినూత్న నిరసనకు దిగింది.
ఉమ్మడి దారికి అడ్డంగా వేసిన ముళ్ల కంచెను తొలగించి, దారిని పునరుద్ధరించాలని కోరుతూ మునియమ్మాళ్ గతంలోనే పలుమార్లు రెవెన్యూ శాఖ, తాలూకా అధికారులకు వినతిపత్రాలు అందజేసింది. అయినా, అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకుండా కాలయాపన చేస్తూ వచ్చారని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యంతో తీవ్ర మానసిక క్షోభకు గురైన ఆ వృద్ధురాలు, వేరే దారి లేక ఇలా ఆఫీసు ముందే నిరసనకు దిగింది.
తహసీల్దార్ కార్యాలయ ప్రవేశ ద్వారం వద్దనే వృద్ధురాలు చాప పరుచుకుని పడుకోవడంతో, ఆఫీసుకు వచ్చిన ప్రజలు, సిబ్బంది ఏం చేయాలో పాలుపోక నిర్ఘాంతపోయారు. ఈ ఘటన ఉసిలంపట్టి తాలూకా కార్యాలయ ప్రాంగణంలో తీవ్ర కలకలం రేపింది. సమాచారం అందుకున్న అధికారులు, పోలీసులు అక్కడికి చేరుకుని వృద్ధురాలితో చర్చలు జరిపారు. ఆక్రమణను తొలగించి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ పేద వృద్ధురాలి పోరాటం తర్వాతైనా దారికి మోక్షం లభించి, ఆమెకు న్యాయం జరుగుతుందా అని స్థానిక ప్రజలు ఎదురుచూస్తున్నారు.

Leave a Reply