“ఇకపై నేనే నీ తల్లిని!” ఆకలితో గుక్కపట్టి ఏడుస్తున్న పసికందు.. నేపాల్ మంత్రి చేసిన మనసును కదిలించే పని.. వైరల్ అవుతున్న వీడియో..!!”

శిశు సంరక్షణ కేంద్రంలో అత్యంత దుర్భర పరిస్థితుల నుంచి రక్షించిన 17 రోజుల పసికందుకు నేపాల్ మంత్రి సీతా పాడీ తన సొంత బిడ్డలా భావించి స్వయంగా తల్లిపాలు ఇచ్చిన హృదయ విదారక ఘటన సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడమే కాకుండా, ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటోంది.

నేపాల్ రాజధాని ఖాట్మండులోని నక్సల్ ప్రాంతంలో ఉన్న ‘బాల్ మందిర్’ అనాథాశ్రమంలో 15 రోజుల నుంచి రెండేళ్ల వయసున్న దాదాపు 20 మంది పసిపిల్లలు అత్యంత దయనీయ పరిస్థితుల్లో ఉన్నారు. భారీ వర్షాల కారణంగా మురుగునీరు ఆశ్రమం ప్రాంగణంలోకి చేరడంతో పిల్లలందరినీ ఒకే మురికి పరుపుపై పడుకోబెట్టారని, చుట్టూ ఎండిపోయిన నూడుల్స్ చెల్లాచెదురుగా పడి ఉన్న దుస్థితి నెలకొంది.

సోషల్ మీడియా ద్వారా ఈ విషయం తెలుసుకున్న మహిళా, శిశు మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ మంత్రి సీతా పాడీ.. ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా నేరుగా అక్కడికి వెళ్లి ఆ పిల్లలను రక్షించాలని ఆదేశించారు. జూలై 19న రక్షించిన పిల్లల ఆరోగ్య పరిస్థితిని పరిశీలించేందుకు వైద్య బృందంతో కలిసి వెళ్లినప్పుడు, 17 రోజుల వయసున్న ఓ పసికందు ఆకలితో గుక్కపట్టి ఏడవడం మొదలుపెట్టింది. అక్కడ పాలు అందుబాటులో లేకపోవడంతో గమనించిన మంత్రి సీతా పాడీ, వెంటనే ఆ బిడ్డను తన ఒడిలోకి తీసుకుని రెండుసార్లు తల్లిపాలు ఇచ్చారు. దీంతో ఏడుపు ఆపి ఆ పసిపాప ప్రశాంతంగా నిద్రపోయింది.

మీడియాతో మాట్లాడిన మంత్రి, “నేను ఆ చిన్నారిని చేతుల్లోకి తీసుకున్నప్పుడు నా సొంత బిడ్డలాగే భావించాను” అని తెలిపారు. ఆ పాప కొన్ని రోజులుగా సరిగ్గా పాలు తాగలేదని తెలుసుకున్నప్పుడు, “ఇకపై నేనే తన తల్లిని” అని ఆమె భావోద్వేగంతో చెప్పారు. ఈ ఘటన అనంతరం ఆశ్రమంలో పరిస్థితులను మెరుగుపరిచేందుకు ఐదుగురు కొత్త కేర్‌టేకర్‌లను నియమించారు. అంతేకాకుండా అదే ప్రాంతంలోని ప్రభుత్వ స్థలంలో అత్యాధునిక వసతులతో కొత్త భవన నిర్మాణాన్ని ప్రారంభించి, నాలుగు నెలల్లో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అలాగే శిశు సంరక్షణ కేంద్రాల నిర్వహణకు సంబంధించి సరికొత్త నిబంధనలను కూడా ప్రభుత్వం పరిశీలిస్తోంది.

పేదరికం, సామాజిక వివక్షల మధ్య పోరాడి ఎదిగి, తన బాల్యంలో కొంత కాలాన్ని స్వయంగా ఆశ్రమంలోనే గడిపిన సీతా పాడీ.. మార్చి 2026లో నేపాల్ మంత్రిగా బాధ్యతలు స్వీకరించడం గమనార్హం. ఆమె ప్రదర్శించిన ఈ మాతృహృదయం ప్రస్తుతం ఎందరో నెటిజన్ల మనసులను హత్తుకుంటోంది.


Posted

in

by

Tags: