ఎసిడిటీ లేదా గుండెల్లో మంట సమస్య తలెత్తితే, చాలామంది డాక్టర్ వద్దకు వెళ్లకుండా సొంతంగా మెడికల్ షాపుల్లో మాత్రలు కొనుక్కుని వేసుకోవడం పరిపాటిగా మారింది. అయితే, ఇకపై ఎసిడిటీ మాత్రలను అలా అనుకున్న వెంటనే సులభంగా కొనుగోలు చేయడం కుదరదు. దీనికోసం కేంద్ర ప్రభుత్వం ఓ కఠినమైన నిబంధనను విధించింది.
ఎసిడిటీ, కడుపులో పుండ్ల (అల్సర్) చికిత్సకు ఉపయోగించే ‘వోనోప్రాజాన్’ (Vonoprazan) అనే ప్రముఖ మాత్రను.. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ (మందుల చీటీ) లేకుండా మెడికల్ షాపుల్లో అమ్మకూడదని కేంద్ర ఔషధ ప్రమాణాల నియంత్రణ సంస్థ (CDSCO) కఠిన ఆదేశాలు జారీ చేసింది.
భారతదేశంలో 10 మి.గ్రా (mg), 20 మి.గ్రా పరిమాణాల్లో లభించే ఈ వోనోప్రాజాన్ మాత్రను కడుపు, పేగులకు సంబంధించిన తీవ్రమైన సమస్యలకు ఉపయోగిస్తారు. కాబట్టి, ఇకపై ఈ మాత్రను కొనాలంటే కచ్చితంగా అర్హత కలిగిన డాక్టర్ సలహా, ప్రిస్క్రిప్షన్ తప్పనిసరిగా ఉండాలి.
తరచూ ఎసిడిటీ వస్తోంది కదా అని సొంత వైద్యం చేసుకుంటూ, నిరంతరం ఇలాంటి మాత్రలు వేసుకోవడం శరీరానికి పెను ప్రమాదాన్ని కలిగిస్తుంది. ముఖ్యంగా, దీర్ఘకాలం పాటు ఎసిడిటీ మాత్రలు వాడటం వల్ల శరీరంలో విటమిన్ బి12 (Vitamin B12), మెగ్నీషియం స్థాయులు తగ్గిపోయి ఇతర అనేక వ్యాధులు వచ్చే అవకాశం ఉంది.
అంతేకాకుండా, ఫ్యాటీ లివర్ (కాలేయంలో కొవ్వు చేరడం), దీర్ఘకాలిక మలబద్ధకం సమస్యలకు సంబంధించిన కొత్త మందులపై కూడా పరిశోధనలు ముమ్మరంగా జరుగుతున్నాయి. కాబట్టి, సాధారణ ఎసిడిటీయే కదా అని నిర్లక్ష్యంగా మాత్రలు వేసుకోకుండా, సమస్య కొనసాగితే వెంటనే వైద్యుడిని సంప్రదించడమే సురక్షితం.

Leave a Reply