కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ‘వికసిత్ భారత్-ఉపాధి, జీవనోపాధి కల్పన పథకం’ కింద చేపట్టనున్న పనుల సరికొత్త జాబితాను విడుదల చేసింది.
ఈ నూతన పథకంలో మొత్తం 375 రకాల పనులను చేర్చారు. గతంలో ఉన్న 266 పనులతో పోలిస్తే ఇది 41 శాతం ఎక్కువ. దీని ద్వారా గ్రామీణ ప్రజలకు మరింత విస్తృతమైన ఉపాధి అవకాశాలతో పాటు మౌలిక వసతుల అభివృద్ధి కూడా సమకూరనుంది.
ఈ నూతన జాబితాలో జల సంరక్షణకు అత్యధిక ప్రాధాన్యతనిస్తూ ఏకంగా 128 పనులను కేటాయించారు. దీని పరిధిలో చెక్ డ్యామ్లు, ఊట కట్టలు, భూగర్భ రక్షణ గోడలు, భూగర్భ జలాల రీఛార్జ్ గుంతలు, వాగులు-నదుల పునరుజ్జీవనం వంటి పనులు చేపట్టనున్నారు. అంతేకాకుండా డ్రిప్ ఇరిగేషన్, పైకప్పు వర్షపు నీటి నిల్వ, ‘ఐస్ స్తూపాలు’ (Ice Stupas) వంటి ఆధునిక సాంకేతిక విధానాలను కూడా ఈ జాబితాలో చేర్చారు.
గ్రామీణ మౌలిక సదుపాయాలను బలోపేతం చేసేందుకు 111 ప్రాజెక్టులను ప్రతిపాదించారు. సోలార్ వీధి దీపాలు, వ్యర్థాల రీసైక్లింగ్ కేంద్రాలు, గ్రామీణ గ్రంథాలయాలు, పశు వైద్య కేంద్రాలు, ప్రభుత్వ పాఠశాలల్లో తరగతి గదులు, ప్రయోగశాలల నిర్మాణం వంటివి ఇందులో భాగంగా ఉంటాయి. అలాగే ప్రజల జీవనోపాధిని పెంపొందించేందుకు వ్యవసాయ ఉత్పత్తుల ప్రాసెసింగ్ కేంద్రాలు, శీతల గిడ్డంగులు (కోల్డ్ స్టోరేజ్), పుట్టగొడుగుల పెంపక కేంద్రాలు, మహిళా స్వయం సహాయక సంఘాల కోసం ‘SHE మార్ట్స్’ విక్రయ కేంద్రాలను సైతం ఏర్పాటు చేయనున్నారు.
మొట్టమొదటిసారిగా, ‘విపత్తు సన్నద్ధత – తీవ్ర వాతావరణ మార్పుల నిర్వహణ’ విభాగం కింద 38 సరికొత్త పనులను జోడించారు. ఇందులో వరద సహాయక కేంద్రాలు, కట్టల పటిష్టత, వరద రక్షణ గోడల నిర్మాణం, అటవీ కార్చిచ్చుల నియంత్రణ చర్యలు చేపడతారు. దీని ద్వారా వరదలు, తుఫానులు, కరవు వంటి ప్రకృతి వైపరీత్యాల నుంచి గ్రామీణ ప్రాంతాలను సురక్షితంగా ఉంచేందుకు వెసులుబాటు కల్పించారు.
ఈ 375 పనుల్లో వ్యవసాయ సంబంధిత పనులు 181 ఉండగా, పేద, అట్టడుగు వర్గాల కుటుంబాలకు ప్రత్యక్ష ప్రయోజనం చేకూర్చే పనులు 107 ఉన్నాయి. స్థానిక అవసరాలకు అనుగుణంగా ఏ పనులను చేపట్టాలనేది ‘గ్రామసభ’ సమావేశంలోనే నిర్ణయిస్తారు. మొత్తంగా చూస్తే, ఈ సరికొత్త 125 రోజుల ఉపాధి పథకం కేవలం కూలీ పనులకే పరిమితం కాకుండా, గ్రామాల సుస్థిర ప్రగతికి, ప్రజల జీవన ప్రమాణాల మెరుగుదలకు దోహదపడేలా రూపుదిద్దుకుంది.

Leave a Reply