జెరూసలేం: ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య పోరు ఇప్పుడు అణు కేంద్రాల లక్ష్యంగా మారుతోంది. శనివారం ఇరాన్ జరిపిన క్షిపణి దాడులు అరాద్ మరియు డిమోనా (Dimona) నగరాలను తాకినట్లు ఇజ్రాయెల్ సైన్యం (IDF) ధృవీకరించింది.
ఈ దాడుల్లో ఒక చిన్నారితో సహా మొత్తం 47 మంది గాయపడ్డారు. డిమోనా నగరంలో ఇజ్రాయెల్‌కు చెందిన అత్యంత సున్నితమైన అణు పరిశోధనా కేంద్రం ఉంది. ఇటీవల ఇరాన్‌లోని ‘నతాంజ్’ అణు కేంద్రంపై ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడులకు ప్రతీకారంగానే ఇరాన్ ఈ క్షిపణి దాడులు చేసినట్లు భావిస్తున్నారు. ఇరుపక్షాల దాడుల నేపథ్యంలో అంతర్జాతీయ అణుశక్తి సంస్థ (IAEA) తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ప్రస్తుతం ఎక్కడా రేడియేషన్ వెలువడినట్లు ఆధారాలు లేవని పేర్కొంది.
గాయపడిన వారి వివరాలు: మగెన్ డేవిడ్ ఎడోమ్ (MDA) నివేదిక ప్రకారం, ఒక 12 ఏళ్ల బాలుడు క్షిపణి శకలాలు తగిలి తీవ్రంగా గాయపడ్డాడు. మరో 30 ఏళ్ల మహిళ గాజు ముక్కలు తగిలి గాయపడగా, మరో 31 మంది స్వల్ప గాయాలతో బయటపడ్డారు. దాదాపు 14 మంది తీవ్ర భయాందోళనల (Anxiety) కారణంగా ఆసుపత్రిలో చేరారు. క్షిపణి ఒక కమ్యూనిటీ బిల్డింగ్‌పై పడటంతో పాత ఇళ్లు దెబ్బతిన్నాయి.
డిమోనాను ‘లిటిల్ ఇండియా’ అని ఎందుకు అంటారు? డిమోనా నగరంలో సుమారు 7,500 మంది భారతీయ సంతతికి చెందిన యూదులు నివసిస్తున్నారు. ఇది ఆ నగర జనాభాలో దాదాపు 30 శాతం.
- మహారాష్ట్ర మూలాలు: ఇక్కడి వారు ఎక్కువగా మహారాష్ట్రకు చెందిన వారు. నేటికీ వీరు మరాఠీ భాష మాట్లాడుతుంటారు.
- భారతీయ రుచులు: ఇక్కడి వీధుల్లో సోన్‌పాపిడి, గులాబ్ జామూన్, భేల్పురి, చాట్ వంటి భారతీయ స్నాక్స్ విరివిగా లభిస్తాయి.
- క్రికెట్: భారతీయ యువతలో క్రికెట్ ఎంత పాపులరో, ఇక్కడ కూడా అంతే క్రేజ్ ఉంది. అందుకే ఈ నగరాన్ని ‘లిటిల్ ఇండియా’ అని పిలుస్తారు.
