బీరుట్/జెరూసలేం: మధ్యప్రాచ్యంలో శాంతి చర్చల ముసుగులో భీకర విధ్వంసం కొనసాగుతోంది. దక్షిణ లెబనాన్‌లో ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ (IDF) అనుసరిస్తున్న వ్యూహం ఇప్పుడు ప్రపంచాన్ని విస్మయానికి గురిచేస్తోంది. వ్యూహాత్మక ప్రాంతాల్లోని పల్లెలను ఇజ్రాయెల్ భూస్థాపితం చేస్తోంది. కేవలం లక్షిత దాడులు మాత్రమే కాకుండా, ఏకంగా ఊళ్ల ఉనికినే తుడిచిపెట్టేలా ఇళ్ల కింద భారీగా పేలుడు పదార్థాలను అమర్చి రిమోట్ కంట్రోల్‌తో పేల్చివేస్తోందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
మారణహోమం సాగుతున్న యుద్ధ భూమిలోని కీలక పరిణామాలు ఇవే:
- గ్రామాలే మాయం.. ‘డొమిసైడ్’ వ్యూహం: ‘గార్డియన్’ నివేదిక ప్రకారం.. సరిహద్దుల్లోని తైబెహ్, నకౌరా, డీర్ సెరియన్ వంటి గ్రామాల్లోని ఇళ్లలో ఇజ్రాయెల్ బలగాలు భారీగా ఎక్స్‌ప్లోజివ్స్‌ను అమర్చాయి. రిమోట్ ద్వారా వీటిని పేల్చివేయడంతో ఆయా గ్రామాలు వల్లకాడుగా మారాయి. నిపుణులు దీనిని ‘డొమిసైడ్’ (వ్యవస్థీకృత గృహ విధ్వంసం) అని పిలుస్తున్నారు. అంటే భవిష్యత్తులో అక్కడ జనం నివసించడానికి వీల్లేకుండా సర్వనాశనం చేయడమే ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కాట్జ్ ప్లాన్ అని తెలుస్తోంది.
- లిటానీ నది వరకు ‘సెక్యూరిటీ జోన్’: ఈ ఇళ్ల కింద హిజ్బుల్లాకు చెందిన సొరంగాలు, ఆయుధశాలలు ఉన్నాయని ఇజ్రాయెల్ వాదిస్తోంది. అయితే, లెబనాన్ దక్షిణ సరిహద్దు నుంచి లిటానీ నది వరకు ఉన్న భూభాగాన్ని ఆక్రమించి, అక్కడ ఒక పటిష్టమైన ‘భద్రతా జోన్’ ఏర్పాటు చేయడమే ఇజ్రాయెల్ అసలు ఉద్దేశమని విశ్లేషకులు భావిస్తున్నారు.
- కన్నీరు మున్నీరవుతున్న లెబనాన్: లెబనీస్ మీడియా సమాచారం ప్రకారం.. ఇప్పటివరకు ఈ యుద్ధంలో మరణించిన వారి సంఖ్య 2,000 దాటిపోయింది. లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. తమ ఊళ్లు నేలమట్టం కావడంతో బాధితులు తిరిగి వెళ్లే దారి కూడా మూసుకుపోయింది.
- ఇస్లామాబాద్ చర్చల విఫలం: పాకిస్థాన్‌లో జరిగిన అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు ఎటువంటి ఫలితాన్ని ఇవ్వలేదు. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఇరాన్‌ను హెచ్చరిస్తూ.. తాము అత్యుత్తమ ఆఫర్‌ను టేబుల్ మీద ఉంచామని, ఇక తేల్చుకోవాల్సింది టెహ్రాన్ మాత్రమేనని స్పష్టం చేశారు. మరోవైపు, అమెరికా తమ నమ్మకాన్ని గెలవడంలో విఫలమైందని ఇరాన్ ప్రతినిధి మహ్మద్ బాకర్ గాలిబాఫ్ ఆరోపించారు.
ఒకవైపు కాల్పుల విరమణ కోసం ప్రపంచ దేశాలు ప్రయత్నిస్తుంటే.. మరోవైపు లెబనాన్‌లో జరుగుతున్న ఈ వ్యవస్థీకృత విధ్వంసం పెను మానవీయ సంక్షోభానికి దారితీస్తోంది.
