వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మాదురో అరెస్ట్ (అపహరణగా అభివర్ణిస్తున్నారు) పై పిలిపించిన ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి (UNSC) సమావేశం రసాభాసగా మారింది. డోనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న ఈ ‘న్యూ నార్మల్’ విధానంపై రష్యా, చైనాలతో పాటు కొలంబియా వంటి దేశాలు తీవ్రంగా మండిపడ్డాయి.
అన్ని వైపుల నుండి విమర్శలు ఎదుర్కొంటున్న అమెరికా తన చర్యను గట్టిగా సమర్థించుకుంది. వెనిజులాను ఆక్రమించుకోవాలనే ఉద్దేశ్యం తమకు లేదని, ఇది కేవలం మాదకద్రవ్యాల (Drugs) అక్రమ రవాణాకు వ్యతిరేకంగా చేపట్టిన చర్య మాత్రమేనని స్పష్టం చేసింది. రష్యా మరియు కొలంబియా సంయుక్తంగా అమెరికాపై దాడి చేస్తూ, ఇది ‘అంతర్జాతీయ నేరం’ అని పేర్కొన్నాయి. వాషింగ్టన్ ఒక దేశ సార్వభౌమత్వాన్ని కాలరాసి ప్రపంచం ముందు ఒక ప్రమాదకరమైన ఉదాహరణను ఉంచిందని రష్యా మండిపడింది.
“మాదురో దంపతులను వెంటనే విడుదల చేయాలి” ఈ సాయుధ దాడికి ఎటువంటి హేతుబద్ధమైన కారణం లేదని రష్యా ప్రతినిధి విమర్శించారు. నికోలస్ మాదురో మరియు ఆయన భార్యను బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అమెరికా చర్చలు, దౌత్య మార్గాలను వదిలి తుపాకీ బలంతో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని, ఇది ‘స్టేట్ టెర్రరిజం’ (రాజకీయ ఉగ్రవాదం) కు సమానమని రష్యా పేర్కొంది.
కొలంబియా ఆవేదన కొలంబియా అభ్యర్థన మేరకు ఈ అత్యవసర సమావేశం జరిగింది. అమెరికా సైనిక చర్య వెనిజులా రాజకీయ స్వేచ్ఛను మరియు ప్రాదేశిక సమగ్రతను ఉల్లంఘించడమేనని కొలంబియా ప్రతినిధి అన్నారు. జనవరి 3న అమెరికా చేపట్టిన చర్యలో ఏ ఒక్క అంతర్జాతీయ నియమాన్ని పాటించలేదని ఆరోపించారు.
ఐక్యరాజ్యసమితి హెచ్చరిక UN అండర్-సెక్రటరీ జనరల్ రోజ్మేరీ డికార్లో ఈ పరిస్థితిని అత్యంత తీవ్రమైనదిగా అభివర్ణించారు. జనవరి 3 నాటి చర్య భవిష్యత్తులో ఏ దేశ సార్వభౌమత్వానికీ భద్రత ఉండదనేలా ఒక ప్రమాదకరమైన సంకేతాన్ని ఇచ్చిందని హెచ్చరించారు.
అమెరికా వివరణ ప్రపంచ దేశాల ఒత్తిడికి అమెరికా స్పందిస్తూ.. “మేము ఏ దేశాన్ని ఆక్రమించడం లేదు. ఇది యుద్ధం కాదు, కేవలం ఒక ‘లా ఎన్ఫోర్స్మెంట్ యాక్షన్’ (చట్టపరమైన చర్య). మాదురో అధ్యక్షుడు కాదు, ఒక ‘నార్కో-ట్రాఫికర్’ (మాదకద్రవ్యాల స్మగ్లర్)” అని అమెరికా ప్రతినిధి పేర్కొన్నారు. అమెరికా కోర్టులో ఆయనపై విచారణ జరుగుతుందని స్పష్టం చేశారు.
