“ఇది ఆఫీస్ కాదు, డిజిటల్ జైలు!”.. క్రూరమైన బాస్ ఆగడాలు భరించలేక బయటపడ్డ ఉద్యోగి సంచలన కథ.. రెడ్డిట్‌లో వైరల్ అవుతున్న కార్పొరేట్ అరాచకం..!!!

కార్పొరేట్ కంపెనీలలో ఉండే విపరీతమైన పని ఒత్తిడి, ఉన్నతాధికారుల మితిమీరిన వేధింపులకు సంబంధించిన షాకింగ్ విషయాలు అప్పుడప్పుడు వెలుగులోకి వచ్చి తీవ్ర చర్చనీయాంశమవుతుంటాయి.

ఈ క్రమంలోనే ప్రముఖ సోషల్ మీడియా వేదిక రెడ్డిట్ (Reddit)లో ‘Such_Cauliflower_937’ అనే యూజర్, తన మునుపటి కంపెనీలో తాను ఎదుర్కొన్న విషపూరిత పని వాతావరణం (టాక్సిక్ వర్క్ కల్చర్) గురించి పంచుకున్న వివరాలు నెటిజన్లను విస్మయానికి గురిచేస్తున్నాయి. ఏదో సాధారణ ఉద్యోగమే కదా అనుకుని చేరిన ఆ ఆఫీసులో, రోజురోజుకూ పనిభారంతో పాటు వేధింపులు, ఆంక్షలు హద్దులు దాటిపోయాయని ఆ ఉద్యోగి ఆవేదన వ్యక్తం చేశారు.

అక్కడి మేనేజర్లు సాధారణ పర్యవేక్షణతో ఆగకుండా, హై-డెఫినిషన్ (HD) సీసీటీవీ కెమెరాల ద్వారా ఉద్యోగుల కంప్యూటర్ స్క్రీన్లను జూమ్ చేసి మరీ నిఘా పెట్టేవారని ఆరోపించారు. అంతేకాకుండా ఉద్యోగులు ఎవరితో చాట్ చేస్తున్నారు? స్క్రీన్‌పై ఏం చూస్తున్నారు? అనే వ్యక్తిగత వివరాలను కూడా రహస్యంగా నిఘా వేస్తూ ఆ ఆఫీసును ఒక ‘డిజిటల్ జైలు’లా మార్చేశారని పేర్కొన్నారు. వారంలో ఏడు రోజులూ సెలవు లేకుండా పనిచేయించుకోవడమే కాకుండా, చాలా రోజులు అర్ధరాత్రి 2 గంటల వరకు బలవంతంగా ఆఫీసులోనే ఉంచేవారని వెల్లడించారు.

ఇలాంటి నిరంతర మానసిక వేధింపులతో పాటు, ఏమాత్రం ఆలస్యంగా వచ్చినా బయట నిలబెట్టడం లాంటి అవమానకర చర్యలతో మానసికంగా తీవ్రంగా కుంగిపోయిన ఆ ఉద్యోగి.. చివరకు ఎలాగైనా ఆ నరకం నుంచి బయటపడాలని నిర్ణయించుకున్నారు. సాధారణ పద్ధతిలో సైలెంట్‌గా రాజీనామా లేఖ ఇచ్చి వెళ్లిపోకుండా.. తనకు జరిగిన అన్యాయాలు, ఆ కంపెనీ అరాచకాలు అన్నింటినీ పూసగుచ్చినట్లు వివరిస్తూ తన విభాగం మొత్తానికి ఒక సంచలన ఈమెయిల్ పంపించారు. ఆ మరుసటి రోజు ఉదయం సిబ్బంది ఎవరూ ఆఫీసుకు రాకముందే తన లగేజీ సర్దుకుని అక్కడి నుంచి బయటకు వచ్చేశారు. ప్రస్తుతం ఈ ఉదంతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారగా, నెటిజన్లు ఆ ఉద్యోగి చూపిన తెగువను ప్రశంసిస్తూ మద్దతుగా నిలుస్తున్నారు.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *