భారతీయ వారసత్వ సంపదలో తలమానికంగా నిలిచే తంజావూరు బృహదీశ్వరాలయం గురించి మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా ఇటీవల సోషల్ మీడియాలో చేసిన పోస్ట్, ఈ ఆలయ గొప్పతనాన్ని మరోసారి ప్రపంచానికి చాటిచెప్పింది.
11వ శతాబ్దానికి చెందిన ఈ అద్భుత నిర్మాణాన్ని “ప్రపంచంలోనే అత్యంత సంక్లిష్టమైన ప్రాచీన ఇంజనీరింగ్ అద్భుతం” అని ఆయన అభివర్ణించారు. చోళుల కాలం నాటి ఈ వింతను ఎలా దర్శించాలో వివరిస్తూ ఆయన చేసిన పోస్ట్, ప్రజల్లో కొత్త ఆసక్తిని రేకెత్తించింది.
ఆనంద్ మహీంద్రా తన ఎక్స్ (X) ఖాతాలో స్పందిస్తూ.. భారతదేశ చారిత్రక దేవాలయాల పట్ల తనకున్న మక్కువను వ్యక్తం చేశారు. “ఇవి కేవలం మతపరమైన ప్రార్థనా స్థలాలు మాత్రమే కావు, అంతకు మించిన మేధోపరమైన అనుభూతిని అందిస్తాయి” అని ఆయన పేర్కొన్నారు.
ఆలయ విశిష్టతలు: ఈ ఆలయాన్ని క్రీ.శ. 1003 నుండి 1010 మధ్య కాలంలో నిర్మించారు. సున్నం, సిమెంట్ వంటి ఎటువంటి అంటు పదార్థాలను (Mortar) వాడకుండా కేవలం గ్రేనైట్ రాళ్లతోనే దీనిని నిర్మించడం విశేషం. రాళ్లను ఒకదానితో ఒకటి అనుసంధానించే ‘ఇంటర్‌లాకింగ్’ (Interlocking) సాంకేతికతను ఉపయోగించడం వల్లే, గత వెయ్యేళ్లలో సంభవించిన అనేక భూకంపాలను తట్టుకుని ఈ ఆలయం నేటికీ చెక్కుచెదరకుండా నిలబడింది.
చోళుల వైభవం: మొదటి రాజరాజ చోళుడి కాలంలో నిర్మించిన ఈ ఆలయాన్ని ‘రాజరాజేశ్వరం’ అని కూడా పిలుస్తారు. కావేరీ నది దక్షిణ తీరాన ఉన్న ఈ ఆలయాన్ని స్థానికులు ‘పెద్ద కోవెల’ లేదా ‘పెరువుడైయార్ కోవెల’ అని పిలుచుకుంటారు. ఇది ద్రవిడ నిర్మాణ శైలికి నిలువెత్తు సాక్ష్యం. యునెస్కో (UNESCO) దీనిని ‘అంతరించని చోళుల మహా దేవాలయాల’ (Great Living Chola Temples) జాబితాలో చేర్చింది.
ఇంజనీరింగ్ అద్భుతం: ఆలయ గర్భాలయం పైన ఉండే గ్రేనైట్ ‘విమానం’ (శిఖరం) దక్షిణ భారతదేశంలోనే అత్యంత ఎత్తైన గోపురాలలో ఒకటి. ఆలయ ప్రాంగణంలో ఉన్న నంది విగ్రహం ఒకే రాయితో చెక్కబడిన భారీ శిల్పం. చోళుల కాలం నాటి కాంస్య నటరాజ విగ్రహాల తయారీకి ఈ ఆలయం కేంద్రబిందువుగా నిలిచింది.
నెటిజన్ల స్పందన: ఆనంద్ మహీంద్రా పోస్ట్‌పై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఒక నెటిజన్ స్పందిస్తూ.. “భారతదేశ అద్భుతాలు కేవలం ప్రదేశాలు మాత్రమే కావు, అవి కళ మరియు ఇంజనీరింగ్ యొక్క జీవించి ఉన్న పాఠ్యపుస్తకాలు. ఆధునిక క్రేన్లు లేని కాలంలో 80 టన్నుల బరువున్న ఏకశిలను గోపురం పైకి ఎలా చేర్చారో తలచుకుంటేనే ఆశ్చర్యమేస్తుంది” అని పేర్కొన్నారు.
