దక్షిణ భారతీయుల ఫేవరెట్ టిఫిన్ అయిన దోశను చేతులతో తినకుండా స్పూన్, ఫోర్క్ తో తింటూ నాగ్‌పూర్‌కు చెందిన ఒక ఎటికెట్ ట్రైనర్ (మర్యాదలు నేర్పించే ట్రైనర్) చేసిన వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్‌లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
చేతులతో తింటేనే దోశ అసలైన రుచి తెలుస్తుందని మెజారిటీ ప్రజలు వాదిస్తుంటే, కట్లరీ (స్పూన్, ఫోర్క్) ఉపయోగించడమే నాగరికత, పరిశుభ్రత అని ఆమె పేర్కొన్నారు. ఈ వీడియో బయటకు వచ్చినప్పటి నుంచి సోషల్ మీడియాలో దీనిపై పెద్ద ఎత్తున వాదనలు జరుగుతున్నాయి.
వైరల్ అవుతున్న ఆ వీడియోలో, సదరు ట్రైనర్ తన ప్లేటులోని దోశను ఫోర్క్, స్పూన్ సహాయంతో చాలా జాగ్రత్తగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని తినడం చూడవచ్చు. రెస్టారెంట్లలో చేతులతో తినడం కంటే ఇలా స్పూన్, ఫోర్క్ వాడటమే ఎక్కువ పరిశుభ్రత అని ఆమె తన పోస్టులో రాసుకొచ్చారు. దోశను చేత్తో తుంచి చట్నీ, సాంబార్‌లో నంజుకుని తినే సంప్రదాయ పద్ధతిని ఇష్టపడే ఆహార ప్రియులకు ఇది తీవ్ర అసంతృప్తి కలిగించింది. అంతేకాకుండా నెటిజన్ల నుంచి ఆమె తీరుపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.
మన సంప్రదాయ ఆహారపు అలవాట్లను పక్కనపెట్టి పాశ్చాత్య పద్ధతులను గుడ్డిగా అనుసరించడం ఎంతవరకు అవసరమనే ప్రశ్నలను ఈ ఘటన లేవనెత్తింది. ఆహారం తినే పద్ధతి ఎవరి వ్యక్తిగత ఇష్టం వారిది అయినప్పటికీ, చేతులతో తినడం మానేసి స్పూన్లు వాడటం వల్ల ఆహారంతో ఉండే భావోద్వేగ అనుబంధం తగ్గిపోతుందని చాలామంది అభిప్రాయపడుతున్నారు.
సాధారణ పద్ధతిలో చేతులతో తినే దోశ వంటి ఆహారాన్ని కూడా స్పూన్లు, ఫోర్కులతో తినడం నాగరికతా లేక అనవసరమైన ఆడంబరమా అనే చర్చ ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.
