గురుగ్రామ్ సెక్టార్ 89 ప్రాంతంలో స్నేహితుల మధ్య తలెత్తిన వివాదం, ఆ తర్వాత రోడ్డుపై తీవ్ర కలకలానికి దారితీసింది.
వివాదం తర్వాత ఇద్దరు యువకులు ఇంటికి వెళ్లేందుకు ర్యాపిడో క్యాబ్‌ను బుక్ చేసుకుని వేచి ఉన్నారు. క్యాబ్ రాగానే వారు అందులో ఎక్కారు. ఆ సమయంలో అక్కడకు వచ్చిన థార్ కారు డ్రైవర్ అకస్మాత్తుగా క్యాబ్ వైపు కారును వేగంగా పోనిచ్చినట్లు తెలుస్తోంది.
పోలీసుల సమాచారం ప్రకారం, థార్ డ్రైవర్ తీవ్ర మద్యం మత్తులో ఉన్నట్లు సమాచారం. అతను థార్ కారును మళ్లీ మళ్లీ వెనుకకు తీస్తూ వేగంగా వచ్చి క్యాబ్‌ను ఢీకొట్టాడని, క్యాబ్ డ్రైవర్ కారును నిలపాలని చెప్పినప్పటికీ వినకుండా వరుసగా ఢీకొడుతూనే ఉన్నాడని తెలిపారు. ఈ ప్రమాదంలో క్యాబ్ ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది.
ఆ సమయంలో క్యాబ్‌లో ఉన్న ఇద్దరు యువకులు, డ్రైవర్ అదృష్టవశాత్తూ ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. సరైన సమయానికి ఎయిర్‌బ్యాగ్‌లు తెరుచుకోవడంతో పెద్ద ప్రమాదం తప్పినట్లు చెప్తున్నారు. ఈ సంఘటనను అక్కడ ఉన్న కొందరు స్థానికులు వీడియో తీయగా, ఆ దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
సంఘటన తర్వాత థార్ డ్రైవర్, అతనితో ఉన్న మరొక వ్యక్తి అక్కడ నుంచి పరారైనట్లు పోలీసులు తెలిపారు. క్యాబ్ డ్రైవర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఖేడ్కీ దౌలా పోలీస్ స్టేషన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఢిల్లీ రిజిస్ట్రేషన్ నంబర్ ఉన్న థార్ కారు ఆధారంగా నిందితులను గుర్తించే పనిలో పోలీసులు ఉన్నారు.

Leave a Reply