ఇంట్లోని ఇనుప గేటు వద్ద ఆడుకుంటున్న ఓ బాలుడు.. అనుకోకుండా గేటు కడ్డీల మధ్య తన తలను పెట్టాడు. అయితే తలను బయటకు తీసుకోలేక అక్కడే ఇరుక్కుపోయాడు. నొప్పితో, భయంతో బాలుడు గట్టిగా ఏడుస్తుండటంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.
విషయం తెలుసుకున్న స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. హుటాహుటిన అక్కడికి చేరుకున్న ఫైర్ సిబ్బంది.. బాలుడికి ఎలాంటి గాయం కాకుండా ఎంతో చాకచక్యంగా అతడిని బయటకు తీశారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
గేటు కడ్డీల మధ్య తల ఇరుక్కుపోవడంతో బాలుడు తీవ్ర భయంతో కేకలు వేయడం చూసి తల్లిదండ్రులు, చుట్టుపక్కల వారు ఆందోళనకు గురయ్యారు. అయితే ఫైర్ సిబ్బంది సమయస్ఫూర్తితో వ్యవహరించడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
సాధారణంగా ఇనుప కడ్డీలను కట్టర్తో కోస్తే.. వాటి వల్ల కలిగే కదలికలు, పదునైన ఇనుప అంచుల కారణంగా బాలుడి ముఖం, మెడకు గాయాలయ్యే ప్రమాదం ఉందని ఫైర్ సిబ్బంది గుర్తించారు.
దీంతో కడ్డీలను కట్ చేయకుండా.. బాలుడి తలను ఏ కోణంలో గేటులోకి పెట్టాడో అదే కోణంలో అతడి శరీరాన్ని చాలా జాగ్రత్తగా కదిలిస్తూ.. కడ్డీల మధ్య నుంచి తలను బయటకు తీసే ప్రయత్నం చేశారు.
కొద్దిసేపటి పాటు ఎంతో ఓపికగా, జాగ్రత్తగా చేసిన ఈ ప్రయత్నం చివరకు ఫలించింది. బాలుడిని ఎలాంటి గాయాలు కాకుండా సురక్షితంగా బయటకు తీశారు.
ఈ ఘటనను కొందరు మొబైల్ ఫోన్లో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వీడియో వైరల్గా మారింది. బాలుడి ప్రాణాలను కాపాడటంతో పాటు అతడికి ఎలాంటి గాయం కాకుండా చాకచక్యంగా రక్షించిన ఫైర్ సిబ్బందిపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.
