ఇన్సూరెన్స్ తీసుకున్న ఐదో రోజే గుండెపోటుతో భార్య మృతి.. మోసం చేయాలని చూసిన హెచ్‌డీఎఫ్‌సీకి వినియోగదారుల కోర్టు రూ. 50 లక్షల షాక్ ట్రీట్‌మెంట్..!!!

విశాఖపట్నం: విశాఖపట్నంలో నివసిస్తున్న 53 ఏళ్ల సవరా భాస్కర్ భార్య సవరా రాధా.. గత మార్చి 10, 2025న హెచ్‌డీఎఫ్‌సీ (HDFC) లైఫ్ ఇన్సూరెన్స్ సంస్థ నుండి రూ. 50 లక్షల విలువైన ‘స్మార్ట్ ప్రొటెక్ట్ ప్లాన్’ భీమా పాలసీని తీసుకున్నారు. దీనికోసం వార్షిక ప్రీమియంగా రూ. 50,000 కూడా చెల్లించారు.

అయితే దురదృష్టవశాత్తూ, పాలసీ తీసుకున్న కేవలం 5 రోజులకే, అంటే మార్చి 15, 2025న రాధాకు ఇంట్లో అకస్మాత్తుగా గుండెపోటు (కార్డియాక్ అరెస్ట్) రావడంతో ఆమె మరణించారు. ఆ తర్వాత ఆమె భర్త భాస్కర్ భీమా క్లెయిమ్ (డబ్బులు) కోసం దరఖాస్తు చేసుకోగా.. అప్లికేషన్ ఫారమ్‌లో తప్పుడు సమాచారం ఇచ్చారనే నెపంతో పాలసీని రద్దు చేస్తున్నట్లు భీమా సంస్థ లేఖ పంపి, అతని క్లెయిమ్‌ను తిరస్కరించింది.

వినియోగదారుల కోర్టును ఆశ్రయించిన భర్త – ఇన్సూరెన్స్ కంపెనీపై ఆగ్రహం:
భీమా సంస్థ తీసుకున్న ఈ ఏకపక్ష నిర్ణయాన్ని సవాలు చేస్తూ భాస్కర్ వినియోగదారుల కోర్టును ఆశ్రయించారు. ఈ కేసును విచారించిన విశాఖపట్నం వినియోగదారుల కమిషన్ చైర్‌పర్సన్ డాక్టర్ గుడ్ల తనుజ మరియు సభ్యుడు వర్రి కృష్ణమూర్తిలతో కూడిన ధర్మాసనం.. సరైన ఆధారాలు లేకుండా మినహాయింపు నిబంధనలను (ఎక్స్‌క్లూజన్ క్లాజెస్) చూపిస్తూ బాధ్యత నుండి తప్పుకోవడానికి వీల్లేదని ఇన్సూరెన్స్ కంపెనీని తీవ్రంగా మందలించింది.

కోర్టు సంచలన తీర్పు:
బాధిత భర్తకు భీమా మొత్తం రూ. 50 లక్షలను 6% వడ్డీతో కలిపి చెల్లించాలని కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. దీనితో పాటు, భార్యను కోల్పోయి ఇన్సూరెన్స్ కంపెనీ చుట్టూ తిరగడం వల్ల భర్తకు కలిగిన మానసిక క్షోభకు నష్టపరిహారంగా రూ. 25,000, కోర్టు కేసు ఖర్చుల నిమిత్తం మరో రూ. 5,000 కలిపి చెల్లించాల్సిందిగా హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్ ఇన్సూరెన్స్ సంస్థకు కోర్టు సంచలన మరియు కఠిన ఆదేశాలు జారీ చేసింది.


Posted

in

by

Tags: