చెన్నై: పుదుచ్చేరిలోని పాండి మెరీనా బీచ్ తీరంలో రీల్స్ చేయాలనే ఉత్సాహం ఒక ప్రొఫెసర్‌ను ప్రమాదంలోకి నెట్టింది. ప్రమాదాన్ని పసిగట్టకుండా సముద్ర తీరంలోని రాళ్లపైకి ఎక్కి రీల్స్ చేయడానికి ప్రయత్నించిన ఆమె, కాలు జారి రాళ్ల మధ్య చిక్కుకుపోయింది.
విద్యార్థులకు క్రమశిక్షణ, మంచి బుద్ధులు నేర్పాల్సిన ప్రొఫెసర్ హోదాలో ఉండి కూడా, రీల్స్ మోజులో ఇలాంటి ప్రమాదకర చర్యకు పాల్పడటం చర్చనీయాంశంగా మారింది.
ఏం జరిగిందంటే? మదురైకి చెందిన వైష్ణవి (26) చెన్నైలోని ఒక ప్రముఖ ప్రైవేట్ కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. ఆమె తన 10 మంది స్నేహితులతో కలిసి పుదుచ్చేరికి విహారయాత్రకు వెళ్లారు. నిన్న సాయంత్రం 5 గంటల సమయంలో పాండి మెరీనా బీచ్‌కు చేరుకున్న వారు, అక్కడి అందాలను చూసి మురిసిపోయారు. ఈ క్రమంలో వైష్ణవి మరింత ‘లైక్స్’ కోసం సముద్ర అలలు తాకే రాళ్లపైకి ఎక్కి రీల్స్ చేయడానికి ప్రయత్నించింది.
దురదృష్టవశాత్తు, రాళ్లపై నాచు వల్ల కాలు జారి కింద పడిపోయింది. పడిన వేగంలో ఆమె కాలు, నడుము భాగం భారీ రాళ్ల మధ్య ఉన్న సందులో ఇరుక్కుపోయాయి. స్నేహితులు ఎంత ప్రయత్నించినా ఆమెను బయటకు తీయలేకపోయారు.
రెస్క్యూ ఆపరేషన్: సమాచారం అందుకున్న పోలీసులు మరియు అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆ రాళ్లు అర టన్ను కంటే ఎక్కువ బరువు ఉండటంతో సాధారణ తాళ్లతో వాటిని కదపడం సాధ్యం కాలేదు. చివరకు విపత్తు నిర్వహణ బృందం (Disaster Management Team) క్రేన్ సహాయంతో రాళ్లను పక్కకు జరిపి వైష్ణవిని సురక్షితంగా బయటకు తీశారు. అనంతరం ఆమెను 108 అంబులెన్స్‌లో పుదుచ్చేరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె అక్కడ చికిత్స పొందుతున్నారు.
