ఇప్పటికే పెళ్లయింది.. ఇద్దరు పిల్లలకు తల్లీతండ్రులు ఎస్కేప్! ఒకే సమయంలో భార్య, ప్రియురాలు గర్భం.. ఊడిపడ్డ జుట్టుతో విగతజీవిగా పడి ఉన్న గర్భిణి.. ప్రియుడు పరార్..!

రాజస్థాన్‌లోని అల్వార్ ప్రాంతంలో సహజీవనం చేస్తున్న ఓ జంట మధ్య చోటుచేసుకున్న దారుణ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మథుర జిల్లాకు చెందిన యోగేష్ చౌదరి (25), కుంకుమ్ (28)లకు ఇదివరకే వేర్వేరు వ్యక్తులతో వివాహమై ఇద్దరు చొప్పున పిల్లలు కూడా ఉన్నారు. అయినప్పటికీ, కుటుంబ సభ్యుల వ్యతిరేకతను లెక్కచేయకుండా ఇద్దరూ ఇళ్లను వదిలి పారిపోయి, గత ఏడాదిన్నర కాలంగా అల్వార్‌లోని నహర్‌పూర్ గ్రామంలో ఓ అద్దె ఇంట్లో లివ్-ఇన్ రిలేషన్‌షిప్‌లో ఉంటున్నారు.

అక్కడ యోగేష్ ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తుండగా.. కుంకుమ్ సోషల్ మీడియాలో నిత్యం రీల్స్ చేస్తూ ఉండేది. ఈ క్రమంలో గత ఆదివారం అర్ధరాత్రి వీరి మధ్య తీవ్ర వాగ్వాదం చెలరేగి హత్యకు దారితీసింది. సోమవారం ఉదయం గది నుంచి ఎలాంటి శబ్దాలూ రాకపోవడంతో అనుమానం వచ్చిన ఇరుగుపొరుగు వారు ఇంటి యజమానికి సమాచారం అందించారు. ఆయన ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు వచ్చి చూడగా.. ఆ మహిళ హత్యకు గురై విగతజీవిగా పడి ఉండటం కనిపించింది.

గదిలో ఆమె జుట్టు తెగిపడి ఉండటం, సెల్‌ఫోన్ పగలగొట్టి ఉండటాన్ని బట్టి ఆమెపై తీవ్ర దాడి జరిగినట్లు స్పష్టమైంది. పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని వైద్యుల బృందంతో పోస్ట్‌మార్టం నిర్వహించగా, హత్యకు గురైన కుంకుమ్ 5 నెలల గర్భిణి అని తేలింది. విశేషమేమిటంటే.. నిందితుడు యోగేష్ భార్య కూడా ప్రస్తుతం గర్భవతిగా ఉన్నట్లు సమాచారం. ఈ క్రమంలో గర్భం దాల్చిన వ్యవహారంలోనే వీరిద్దరి మధ్య తలెత్తిన ఘర్షణ ఈ హత్యకు దారితీసి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.

ఈ ఘోరానికి పాల్పడిన తర్వాత ప్రియుడు యోగేష్ పరారవడంతో, పోలీసులు అతడి కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. పోస్ట్‌మార్టం అనంతరం మహిళ మృతదేహాన్ని ఆమె బంధువులకు అప్పగించారు. వివాహమై, భర్తను, పిల్లలను వదిలేసి వచ్చిన ఒక మహిళ.. గర్భవతిగా ఉన్న సమయంలోనే ప్రియుడి చేతిలోనే దారుణ హత్యకు గురికావడం ఆ ప్రాంతంలో తీవ్ర విషాదాన్ని, సంచలనాన్ని నింపింది.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *