నేటి ఆధునిక జీవనశైలిలో ఇయర్ ఫోన్స్ మన శరీరంలో ఒక భాగమైపోయాయి. ఆఫీసు పనిలో ఉన్నా, ప్రయాణాల్లో ఉన్నా, వ్యాయామం చేస్తున్నా చెవిలో ఇయర్ బడ్స్ ఉండాల్సిందే. అయితే, గంటల తరబడి వీటిని ఉపయోగించడం వల్ల మీరు శాశ్వతంగా వినికిడి శక్తిని కోల్పోయే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా యువతలో ఈ సమస్య ‘వ్యాధి’లా ప్రబలుతోంది. దీనిపై ఆస్టర్ మిమ్స్ ఆసుపత్రి ఈఎన్టీ కన్సల్టెంట్ డాక్టర్ షమ్నా శ్రీధరన్ అందిస్తున్న ప్రత్యేక విశ్లేషణ మీకోసం..
వినికిడిని దెబ్బతీసే ‘ముగ్గురు’ విలన్లు!
మనం వినే శబ్దం మన చెవికి హానికరంగా మారుతుందా లేదా అనేది ప్రధానంగా మూడు అంశాలపై ఆధారపడి ఉంటుంది:
- శబ్ద తీవ్రత: మీరు ఎంత సౌండ్‌లో వింటున్నారు?
- దూరం: శబ్దానికి, మీ చెవికి మధ్య ఎంత దూరం ఉంది? (ఇయర్ ఫోన్స్ నేరుగా కర్ణభేరి దగ్గరే ఉంటాయి, కాబట్టి ప్రమాదం ఎక్కువ).
- సమయం: ఎంతసేపు వింటున్నారు?
డెసిబెల్స్ లెక్కలు.. ప్రమాద ఘంటికలు!
శబ్దాన్ని డెసిబెల్స్ (dB)లో కొలుస్తారు. సాధారణ సంభాషణ 30-60 dB వరకు ఉంటుంది. కానీ, ఇయర్ ఫోన్స్‌లో మనం వినే శబ్దం 80 నుండి 110 dB వరకు ఉంటుంది.
- 85 dB కంటే ఎక్కువ: రోజుకు 8 గంటల పాటు ఈ స్థాయి శబ్దాన్ని వింటే భవిష్యత్తులో వినికిడి సమస్యలు రావడం ఖాయం.
- 120 dB దాటితే: చెవిలో నొప్పి మొదలవుతుంది. ఇయర్ ఫోన్స్ కర్ణభేరికి అతి దగ్గరగా ఉండటం వల్ల చిన్న తరంగాలు కూడా లోపలి చెవిలోని ‘కోక్లియా’ను తీవ్రంగా దెబ్బతీస్తాయి.
లోపలి చెవిలో ఏం జరుగుతుంది?
మన లోపలి చెవిలో ‘కోక్లియా’ అనే భాగం ఉంటుంది. ఇందులో సూక్ష్మమైన రోమ కణాలు (Hair Cells) ఉంటాయి. అధిక శబ్దంతో పాటలు విన్నప్పుడు ఈ కణాలపై తీవ్ర ఒత్తిడి పడి అవి నశిస్తాయి. గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే.. ఒకసారి ఈ కణాలు నశించిపోతే అవి మళ్ళీ తిరిగి పెరగవు. ఫలితంగా శాశ్వత వినికిడి లోపం ఏర్పడుతుంది.
ప్రయాణాల్లో మరింత ప్రమాదం!
బస్సుల్లో లేదా బైక్ పై వెళ్లేటప్పుడు బయట ట్రాఫిక్ శబ్దాన్ని వినపడకుండా ఉండటానికి మనం వాల్యూమ్ 90 dB కంటే ఎక్కువ పెంచుతాము. ఇది చెవికి ‘డబుల్ షాక్’ ఇస్తుంది. ఈ అలవాటు వృద్ధాప్యం రాకముందే మిమ్మల్ని బధిరులుగా మార్చవచ్చు.
ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే అలర్ట్ అవ్వండి!
మీ వినికిడి శక్తి క్రమంగా తగ్గుతోందని చెప్పడానికి ఇవే నిదర్శనాలు:
- చెవిలో ఎప్పుడూ రింగుమనే శబ్దం లేదా ఈల వేసినట్లు వినిపించడం (Tinnitus).
- ఎదుటివారు మాట్లాడుతున్న మాటలు అస్పష్టంగా అనిపించడం.
- రద్దీ ప్రదేశాల్లో మాటలను సరిగ్గా గుర్తుపట్టలేకపోవడం.
- టీవీ లేదా ఫోన్ వాల్యూమ్ అందరికంటే ఎక్కువగా పెట్టి వినాలనిపించడం.
- చెవి ఏదో మూసుకుపోయినట్లు లేదా భారంగా అనిపించడం.
వైద్యుల సలహా: ’60-60′ రూల్ పాటించండి!
మీ వినికిడి శక్తిని కాపాడుకోవడానికి డాక్టర్లు సూచించే అత్యంత సులభమైన పద్ధతి ’60-60′ సూత్రం:
- మొదటి 60: మీ డివైస్ వాల్యూమ్ ఎప్పుడూ 60 శాతం కంటే తక్కువగానే ఉండాలి.
- రెండవ 60: నిరంతరాయంగా 60 నిమిషాల కంటే ఎక్కువసేపు ఇయర్ ఫోన్స్ వాడకూడదు. మధ్యలో విరామం ఇవ్వడం వల్ల చెవిలోని కణాలు మళ్ళీ కోలుకుంటాయి.
చివరి మాట: మీకు వినికిడి తక్కువగా ఉన్నట్లు అనిపించినా, చెవిలో శబ్దాలు వస్తున్నా ఆలస్యం చేయకుండా ఈఎన్టీ నిపుణుడిని సంప్రదించండి. ఆన్లైన్ చిట్కాలు పాటిస్తూ కాలాన్ని, వినికిడిని వృధా చేసుకోవద్దు. శాస్త్రీయ చికిత్స మాత్రమే మిమ్మల్ని ఈ మూగ ప్రపంచం నుండి కాపాడుతుంది.
