ఇరాన్ ఆట.. సౌదీ అరేబియా దుస్థితి.. యుద్ధం ముగిశాక వెల్లడైన నిజం.

అంతర్జాతీయం: గ్లోబల్ ఆయిల్ మార్కెట్‌లో శుక్రవారం మరోసారి ఉత్కంఠ నెలకొంది. సౌదీ అరేబియా చమురు ఉత్పత్తి కేంద్రాలపై దాడులు, హార్ముజ్ జలసంధిలో నౌకల రాకపోకల నిలిపివేతతో ఒక్కసారిగా తగ్గిన క్రూడాయిల్ ధరలు మళ్లీ మండిపోతున్నాయి. ఇరాన్-అమెరికా మధ్య రెండు వారాల యుద్ధ విరమణ ప్రకటించినప్పటికీ, మధ్యప్రాచ్యంలో శాంతి నెలకొనలేదు సదా.. సంక్షోభం మరింత ముదిరింది.

సౌదీ అరేబియాపై విరుచుకుపడ్డ దాడులు!

సౌదీ ప్రభుత్వ అధికారిక వార్తా సంస్థ ‘SPA’ వెల్లడించిన గణాంకాల ప్రకారం.. దేశంలోని కీలక చమురు క్షేత్రాలపై జరిగిన దాడుల వల్ల సౌదీ రోజువారీ ఉత్పత్తి సామర్థ్యం దాదాపు 6 లక్షల బ్యారెళ్లు పడిపోయింది. ఈస్ట్-వెస్ట్ పైప్‌లైన్ ద్వారా రవాణా అయ్యే చమురు కూడా 7 లక్షల బ్యారెళ్లు తగ్గిపోయింది.

ముఖ్యంగా ఖురైస్ (Khurais) మరియు మనీఫా (Manifa) చమురు క్షేత్రాల్లో జరిగిన భారీ నష్టం వల్ల సౌదీ మొత్తం ఉత్పత్తిలో 5 శాతం మేర దెబ్బతింది. ప్రపంచంలోనే అతిపెద్ద చమురు ఎగుమతిదారు అయిన సౌదీలో ఈ విచ్ఛిన్నం ప్రపంచవ్యాప్తంగా సరఫరా గొలుసును దెబ్బతీసింది.

హార్ముజ్ జలసంధిలో ఇరాన్ మైన్ల కలకలం!

యుద్ధ విరమణ తర్వాత కూడా హార్ముజ్ జలసంధిలో ట్యాంకర్ల రాకపోకలు సాధారణ స్థితికి రాలేదు. గురువారం నాడు ఈ మార్గంలో ప్రయాణించే ఓడల సంఖ్య గణనీయంగా తగ్గింది. దీనికి ప్రధాన కారణం.. ఇరాన్ సైన్యం హార్ముజ్ మార్గంలో సముద్ర గర్భంలో మైన్లను (Mines) అమర్చినట్లు ప్రకటించడమే. ప్రత్యామ్నాయ మార్గాలను సూచిస్తూ ఇరాన్ తీసుకున్న ఈ నిర్ణయం అంతర్జాతీయ వాణిజ్యాన్ని భయపెడుతోంది.

మళ్లీ $100 దిశగా..

అమెరికా-ఇరాన్ మధ్య షరతులతో కూడిన యుద్ధ విరమణ మరియు ఇజ్రాయెల్-లెబనాన్ చర్చలకు సిద్ధమవ్వడం మార్కెట్‌కు కొంత ఊరటనిచ్చినప్పటికీ, ధరలు మాత్రం తగ్గడం లేదు.

  • బ్రెండ్ క్రూడ్ ఫ్యూచర్స్: బ్యారెల్ ధర 98 డాలర్ల వద్ద కొనసాగుతోంది.
  • WTI క్రూడ్: నేడు 100 డాలర్ల మార్కును దాటి దూసుకుపోతోంది.
భారత్‌కు సవాలు.. రష్యాకు లాభం?

సౌదీలో ఉత్పత్తి సమస్యలు, హార్ముజ్ జలసంధిలో ఉద్రిక్తతలు ఇలాగే కొనసాగితే ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది. ఇది భారత్ వంటి దిగుమతులపై ఆధారపడే దేశాలకు పెను సవాలుగా మారనుంది. అయితే, ఈ సరఫరా కొరతను ఆసరాగా చేసుకుని తన చమురును విక్రయించేందుకు రష్యా మాస్టర్ ప్లాన్ సిద్ధం చేస్తోంది. బ్రిక్స్ (BRICS) దేశాల సహకారంతో రష్యా వేస్తున్న ఈ అడుగులు అగ్రరాజ్యం అమెరికాకు షాక్ ఇచ్చేలా ఉన్నాయి.

రానున్న రోజుల్లో మధ్యప్రాచ్య రాజకీయాలు గ్లోబల్ ఎకానమీని ఎలా మలుపు తిప్పుతాయో వేచి చూడాలి.


Posted

in

by

Tags: