టెహ్రాన్: అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్‌పై తీవ్ర దాడులు చేస్తున్నాయి. దీనికి ప్రతిగా ఇరాన్ కూడా ప్రతీకార దాడులకు దిగుతోంది. ఈ క్రమంలో, ఒమన్ తీరం సమీపంలోని హార్ముజ్ జలసంధి గుండా వెళ్తున్న ఒక ఆయిల్ ట్యాంకర్ (ముడి చమురు నౌక)పై ఇరాన్ అకస్మాత్తుగా దాడి చేసింది. ఆ నౌక ప్రస్తుతం సముద్రంలో మంటల్లో చిక్కుకుంది. అందులో 14 మంది భారతీయులతో సహా మొత్తం 20 మంది సిబ్బంది ఉన్నట్లు సమాచారం. వారి పరిస్థితి ఏమిటనేది ఇప్పుడు ఆందోళనకరంగా మారింది.
ప్రపంచవ్యాప్తంగా జరిగే ముడి చమురు వ్యాపారంలో 20 శాతం హార్ముజ్ జలసంధి (Strait of Hormuz) ద్వారానే జరుగుతుంది. యుద్ధం ప్రారంభమైన నేపథ్యంలో ఈ జలసంధిని మూసివేస్తున్నట్లు ఇరాన్ నిన్న రాత్రి ప్రకటించింది. ఇది ప్రపంచ చమురు మార్కెట్‌పై తీవ్ర ప్రభావాన్ని చూపే అవకాశం ఉంది.
ఈ ఉద్రిక్తతల మధ్య, ఒమన్ గల్ఫ్ ప్రాంతంలోని ముసండమ్ తీరం వద్ద ఉన్న ఆయిల్ ట్యాంకర్‌పై ఇరాన్ దాడి చేయగా అది తగలబడింది. ఈ విషయాన్ని ఒమన్ మారిటైమ్ సెక్యూరిటీ సెంటర్ ధృవీకరించింది. ఈ నౌకపై పలావు (Palau) దేశపు జెండా ఉంది. ఇందులో ప్రయాణిస్తున్న 20 మందిలో 15 మంది భారతీయులు, 5 మంది ఇరానీయులు ఉన్నారని, వారి క్షేమ సమాచారం ఇంకా తెలియరాలేదని వార్తలు వస్తున్నాయి. అమెరికాకు సన్నిహిత మిత్రదేశమైన ఒమన్‌లోని డుకుమ్ ఓడరేవుపై కూడా ఇరాన్ డ్రోన్ దాడులు నిర్వహించింది. అణు ఒప్పంద చర్చల్లో మధ్యవర్తిత్వం వహించిన ఒమన్‌ను కూడా ఇరాన్ లక్ష్యంగా చేసుకోవడంతో మధ్యప్రాచ్యంలో యుద్ధ మేఘాలు మరింతగా కమ్ముకున్నాయి.
