వాషింగ్టన్: మధ్యప్రాచ్యంలో రగులుతున్న యుద్ధం రెండో వారంలోకి ప్రవేశించింది. ఈ ఘర్షణ రోజురోజుకూ ముదురుతుండటంతో అంతర్జాతీయంగా దీని ప్రభావం తీవ్రంగా ఉంది. అయితే, ప్రస్తుత పరిస్థితుల్లో ఇరాన్ ప్రభుత్వం కుప్పకూలే సూచనలు కనిపించడం లేదని అమెరికా నిఘా సంస్థ (Intelligence) నివేదించింది. దీంతో ఈ యుద్ధం ఎప్పుడు ముగుస్తుందనే దానిపై సందిగ్ధత నెలకొంది.
అమెరికా మరియు ఇజ్రాయెల్ గత రెండు వారాలుగా ఎడతెరిపి లేకుండా దాడులు చేస్తున్నప్పటికీ, ఇరాన్ ప్రభుత్వం ఇంకా చెక్కుచెదరకుండా ఉంది. ఇరాన్ యంత్రాంగంపై అక్కడి ప్రభుత్వానికి పట్టు సడలలేదని అమెరికా నిఘా వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.
అమెరికా నిఘా నివేదిక ఏం చెబుతోంది?
అమెరికా నిఘా విభాగానికి చెందిన ఒక ఉన్నత స్థాయి అధికారి మాట్లాడుతూ.. “ఇరాన్ పాలన పడిపోయే ప్రమాదంలో లేదు. ప్రజలపై మరియు దేశంపై ఇరాన్ ప్రభుత్వం ఇంకా పూర్తి నియంత్రణను కలిగి ఉందని మా నివేదికలు చెబుతున్నాయి” అని వెల్లడించారు. ఇటీవల అందిన తాజా నివేదికల్లో కూడా ఇదే విషయం పునరుద్ఘాటించబడింది.
మరోవైపు, ఈ యుద్ధం కారణంగా ముడి చమురు ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఈ ఒత్తిడి కారణంగానే యుద్ధాన్ని త్వరగా ముగించాలని అమెరికాపై అంతర్జాతీయంగా ఒత్తిడి పెరుగుతోంది. అందుకే సైనిక చర్యను త్వరగా ముగిస్తామని అధ్యక్షుడు ట్రంప్ సూచించారు. అయితే, ఇరాన్‌లోని తీవ్రవాద భావజాలం ఉన్న నాయకులు ఉన్నంత కాలం యుద్ధాన్ని ముగించడం కష్టమేనని విశ్లేషకులు భావిస్తున్నారు.
ఇరాన్ నియంత్రణలోనే ఉంది!
అమెరికా-ఇజ్రాయెల్ దాడుల మొదటి రోజే ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మరణించినప్పటికీ, ఇరాన్ ప్రభుత్వం సమన్వయంతో పనిచేస్తోందని నిఘా వర్గాలు తెలిపాయి. ప్రస్తుతానికి ఇరాన్ ప్రభుత్వం పతనం అయ్యేలా కనిపించడం లేదని ఇజ్రాయెల్ అధికారులు కూడా అంగీకరించారు. అయితే, అక్కడి క్షేత్రస్థాయి పరిస్థితులు వేగంగా మారుతున్నందున, ఎప్పుడైనా ఏదైనా జరగొచ్చని అధికారులు అభిప్రాయపడుతున్నారు.
ప్రభుత్వాన్ని పడగొట్టడం కష్టమేనా?
యుద్ధం ప్రారంభమైనప్పుడు, “మీ ప్రభుత్వాన్ని మీరే స్వాధీనం చేసుకోండి” అని ట్రంప్ ఇరాన్ ప్రజలకు పిలుపునిచ్చారు. కానీ, ప్రభుత్వాన్ని కూల్చడం తమ ఉద్దేశ్యం కాదని తర్వాత ట్రంప్ సలహాదారులు వివరణ ఇచ్చారు.
ఖమేనీతో పాటు ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC)కి చెందిన పలువురు ఉన్నత స్థాయి కమాండర్లు చనిపోయినప్పటికీ, ఆయన తర్వాత బాధ్యతలు చేపట్టిన వారు దేశంపై పట్టు సాధించారని నివేదికలు చెబుతున్నాయి. ఖమేనీ కుమారుడు మొజ్తబా ఖమేనీని కొత్త సుప్రీం లీడర్‌గా ప్రకటించిన సంగతి తెలిసిందే. పాత ప్రభుత్వ ఆనవాళ్లు ఏవీ ఉండకూడదని ఇజ్రాయెల్ భావిస్తోంది. అయితే, ప్రస్తుతానికి ఇరాన్ ప్రభుత్వాన్ని ఎలా పడగొట్టాలో ఇరు పక్షాలకు (అమెరికా, ఇజ్రాయెల్) అంతుచిక్కడం లేదు.
అమెరికా దళాల ప్రవేశం?
ఇరాన్ ప్రజలు రోడ్లపైకి వచ్చి పోరాడాలంటే అమెరికా దళాలు ఇరాన్‌లోకి ప్రవేశించాల్సి ఉంటుంది. అమెరికా సైన్యాన్ని పంపే అవకాశాలను ట్రంప్ ప్రభుత్వం మొదటి నుండి తోసిపుచ్చలేదు. మధ్యలో పొరుగున ఉన్న ఇరాక్‌లోని కుర్దిష్ పోరాట యోధులను ఇరాన్‌లోకి పంపే ప్లాన్ చేసినప్పటికీ, వారు అంత బలమైన వారు కాకపోవడంతో ఆ ఆలోచనను విరమించుకున్నట్లు సమాచారం.
