ఇరాన్-అమెరికా ఉద్రిక్తతలు: అమెరికా మరియు ఇజ్రాయెల్‌తో ఉద్రిక్తతలు కొనసాగుతున్న తరుణంలో ఇరాన్ ఒక సంచలన ప్రకటన చేసింది. త్వరలోనే తాము ఒక కొత్త ఆయుధాన్ని ఉపయోగిస్తామని, అది చూసి శత్రువులకు గుండెపోటు వచ్చే అవకాశం ఉందని హెచ్చరించింది.
హోర్ముజ్ జలసంధిని తెరిచేందుకు బదులుగా అమెరికా విధిస్తున్న ఆర్థిక దిగ్బంధనాన్ని తొలగించాలన్న ఇరాన్ ప్రతిపాదనను అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తిరస్కరించిన నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకుంది. ఇరాన్ నౌకాదళ కమాండర్ రియర్ అడ్మిరల్ షహరామ్ ఇరానీ మాట్లాడుతూ.. “ఈ కొత్త ఆయుధం శత్రువులకు చాలా దగ్గరగా ఉంది.. దానిని చూసి వారికి గుండెపోటు రాదని ఆశిస్తున్నాను” అని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.
అమెరికా వ్యూహాలపై ఎద్దేవా: తమపై ఆర్థిక ఒత్తిడి తెచ్చి చర్చలకు బలవంతం చేయాలనుకుంటున్న ట్రంప్ ప్రభుత్వంపై ఇరాన్ కమాండర్ మండిపడ్డారు. అమెరికా విమానవాహక నౌక ‘అబ్రహం లింకన్’పై తాము కనీసం ఏడుసార్లు మిస్సైల్ దాడులు చేశామని, దీనివల్ల అమెరికా కొంతకాలం పాటు వైమానిక కార్యకలాపాలు నిర్వహించలేకపోయిందని ఆయన పేర్కొన్నారు.
హోర్ముజ్ జలసంధిపై పట్టు: అమెరికా మరియు ఇజ్రాయెల్ దాడులకు ప్రతిగా మధ్య ప్రాచ్యంలో వారి స్థావరాలపై 100కు పైగా దాడులు చేశామని ఇరాన్ తెలిపింది. శత్రు దేశాల నౌకల కోసం హోర్ముజ్ జలసంధిని మూసివేసినట్లు, ఇప్పుడు ఆ మార్గం గుండా వెళ్లే నౌకలు ఇరాన్ అధికారుల అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. అమెరికా చర్యలు సోమాలియా సముద్ర దొంగల కంటే ఘోరంగా ఉన్నాయని కమాండర్ విమర్శించారు.
ప్రతిపాదనను తిరస్కరించిన ట్రంప్: బాంబు దాడుల కంటే ఆర్థిక దిగ్బంధనం (Blockade) ఎక్కువ ప్రభావవంతమైనదని, ఇరాన్‌ను అణు ఆయుధాలు సాధించనివ్వబోమని డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. ఇరాన్ ప్రతిపాదనను ఆయన తోసిపుచ్చారు. మరోవైపు, యుద్ధంలో మరణించిన తమ వారి పగ తీర్చుకుంటామని ఇరాన్ శపథం చేయడంతో ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలు మరింత ముదిరాయి.
