ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పేజెష్కియాన్ ఆదివారం అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రకటనపై తీవ్రంగా స్పందించారు. ఇరాన్‌ను ప్రపంచ పటం నుండి తుడిచిపెట్టాలనే భ్రమ, చరిత్ర సృష్టించిన ఒక జాతి సంకల్పం ముందు ఓటమిని అంగీకరించడమేనని ఆయన అన్నారు.
హోర్ముజ్ జలసంధి (Strait of Hormuz) ఇరాన్ శత్రువులకు తప్ప మిగిలిన అన్ని దేశాలకు తెరిచే ఉంటుందని పేజెష్కియాన్ స్పష్టం చేశారు. “బెదిరింపులు మరియు భయం మా ఐక్యతను మరింత బలోపేతం చేస్తాయి. మా భూభాగాన్ని ఉల్లంఘించే వారికి తప్ప హోర్ముజ్ అందరికీ అందుబాటులో ఉంటుంది. ఇలాంటి నిరాధారమైన బెదిరింపులను మేము యుద్ధభూమిలో దీటుగా ఎదుర్కొంటాం” అని ఆయన ఒక పోస్ట్‌లో పేర్కొన్నారు.
అరాఘ్చీ వ్యాఖ్యలు: స్వేచ్ఛా వాణిజ్యం లేకుండా నౌకాయానం సాధ్యం కాదు ఇరాన్ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ అరాఘ్చీ మాట్లాడుతూ.. వాణిజ్య స్వేచ్ఛ లేకుండా నౌకాయాన స్వేచ్ఛ సాధ్యం కాదని అన్నారు. “హోర్ముజ్ జలసంధి మూసివేయబడలేదు. మీరు (అమెరికా) మొదలుపెట్టిన యుద్ధానికి భయపడే నౌకలు రావడానికి సంకోచిస్తున్నాయి. ఏ ఇరానీ కూడా మీ బెదిరింపులకు లొంగడు. గౌరవించడం నేర్చుకోండి. వాణిజ్య స్వేచ్ఛను, నౌకాయాన స్వేచ్ఛను రెండింటినీ గౌరవించండి – లేదంటే దేనినీ ఆశించకండి” అని ‘X’ వేదికగా హెచ్చరించారు.
ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ గాలిబాఫ్ కఠిన హెచ్చరిక: ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ ఎం.బి. గాలిబాఫ్ మరింత ఘాటుగా స్పందించారు. అమెరికా సైనిక బడ్జెట్‌కు నిధులు సమకూర్చే ఆర్థిక సంస్థలను కూడా ఇరాన్ లక్ష్యంగా చేసుకుంటుందని ఆయన అన్నారు. “సైనిక స్థావరాలతో పాటు, అమెరికా ట్రెజరీ బాండ్లను (Treasury Bonds) కొనుగోలు చేసే ఆర్థిక సంస్థలు కూడా మా లక్ష్యాలే. ఆ బాండ్లు ఇరాన్ ప్రజల రక్తంతో తడిశాయి. వాటిని కొనుగోలు చేస్తే మీ ప్రధాన కార్యాలయాలు మరియు ఆస్తులపై దాడులకు ఆహ్వానం పలికినట్లే. మేము మీ పోర్ట్‌ఫోలియోలపై నిఘా ఉంచాం. ఇదే మీకు చివరి హెచ్చరిక” అని పేర్కొన్నారు.
అమెరికా స్పందన: మరోవైపు, అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్ బెసెంట్ స్పందిస్తూ.. ఇరాన్‌పై సైనిక చర్యను కొనసాగించడానికి అమెరికా వద్ద తగినంత వనరులు ఉన్నాయని తెలిపారు. ఇస్లామిక్ రిపబ్లిక్‌తో డీల్ చేయడానికి అధ్యక్షుడు ట్రంప్ అన్ని మార్గాలను తెరిచి ఉంచారని ఆయన అన్నారు. ఇరాన్‌ను తాము పటం నుండి తుడిచిపెట్టేశామని, ఇరాన్ చర్చలకు రావడానికి సిద్ధంగా ఉన్నా, తమకు మాత్రం ఆసక్తి లేదని ట్రంప్ పునరుద్ఘాటించారు.
