పాకిస్థాన్‌లో ఇరాన్ గురించి నాలుగు దేశాలు చర్చలు జరుపుతున్న తరుణంలోనే, పశ్చిమ ఆసియాలో ఆకాశం నుండి కురుస్తున్న నిప్పు ఇకపై భూమి మీద రక్తపాతానికి దారితీయనుందా అనే చర్చ మొదలైంది.
అమెరికా తన సైనిక బలగాలతో ఇరాన్ గడ్డపై అడుగు పెట్టబోతోందా? ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బాఘేర్ గాలిబాఫ్ నేరుగా వాషింగ్టన్‌ను హెచ్చరిస్తూ.. “అమెరికా గ్రౌండ్ ట్రూప్స్ కోసం మా సైన్యం ఎదురుచూస్తోంది. రానివ్వండి.. మేము సిద్ధంగా ఉన్నాం, పచ్చిగా నమిలేస్తాం!” అని వ్యాఖ్యానించారు. ఇంతటి ఘాటు విమర్శలు వస్తున్నా అమెరికా మాత్రం వింతైన మౌనాన్ని పాటిస్తోంది. అయితే, సముద్రంలో మోహరించిన అమెరికా యుద్ధనౌకలు, వేల సంఖ్యలో మరీన్ కమాండోలు మాత్రం మరో కథ చెబుతున్నాయి.
అమెరికా పశ్చిమ ఆసియాలో తన సైనిక శక్తిని వేగంగా పెంచుతోంది. 31వ మరియు 11వ మరీన్ ఎక్స్‌పెడిషనరీ యూనిట్లకు చెందిన కమాండోలు ఇప్పటికే బయలుదేరారు. వీరు కాకుండా 82వ ఎయిర్‌బోర్న్ డివిజన్‌కు చెందిన 2,000 మంది సైనికులు హై అలర్ట్‌లో ఉన్నారు. వీరు ఆర్డర్ వచ్చిన 18 గంటల్లోనే ప్రపంచంలో ఎక్కడైనా శత్రువుల విమానాశ్రయాలు లేదా మిలిటరీ బేస్‌లను స్వాధీనం చేసుకోగలరు.
10 వేల మంది సైనికుల మోహరింపు: అమెరికా మరో 10,000 మంది సైనికులను పంపేందుకు సిద్ధమవుతోంది. ఇరాక్ లేదా ఆఫ్ఘనిస్థాన్ లాగా ఇరాన్‌ను పూర్తిగా ఆక్రమించుకోవడానికి ఈ సంఖ్య సరిపోదు (ఇరాక్ కోసం 1.5 లక్షల మందిని పంపారు). కానీ, ఈ 10 వేల మంది సైనికులు ‘సర్జికల్ స్ట్రైక్స్’ లేదా అత్యంత ప్రమాదకరమైన ‘గ్రౌండ్ ఆపరేషన్ల’ కోసం సిద్ధం చేయబడుతున్నారు. వీరు తీర ప్రాంతాలపై అకస్మాత్తుగా దాడి చేసి, పని ముగించుకుని వెంటనే వెనక్కి వచ్చేస్తారు.
మూడు ప్రమాదకరమైన మిషన్లు:
- ఖార్గ్ ఐలాండ్ (Kharg Island): ఇది ఇరాన్‌కు ‘పరుసవేది’ వంటిది. ఇరాన్ ముడిచమురులో 90% ఇక్కడి నుండే ప్రపంచానికి సరఫరా అవుతుంది. దీనిని అమెరికా స్వాధీనం చేసుకుంటే ఇరాన్ ఆర్థిక మూలాలు దెబ్బతింటాయి.
- హార్ముజ్ దీవులు: క్యూషమ్ (Qeshm), లారక్ (Larak) వంటి దీవులపై అమెరికా కన్నేసింది. ప్రపంచ చమురులో 20% ప్రవహించే ఈ మార్గంలో ఇరాన్ డ్రోన్లు, మైన్లను అమెరికా ధ్వంసం చేయాలనుకుంటోంది.
- యూరేనియం వేట: గత ఏడాది జూన్‌లో జరిగిన దాడుల సమయంలో ఇరాన్ నుండి 440 కిలోల సుసంపన్నమైన యూరేనియం మాయమైంది. దానిని వెతికి పట్టుకోవడానికి అమెరికా స్పెషల్ ఫోర్సెస్ ఇరాన్ లోపలికి వెళ్లాల్సి రావచ్చు.
అమెరికా మౌనానికి కారణం? ఇరాన్‌తో యుద్ధం అంటే ‘అగ్నిగుండంలోకి దూకడమే’ అని అమెరికాకు తెలుసు. డొనాల్డ్ ట్రంప్ ఇటీవల మాట్లాడుతూ.. “నేను సైన్యాన్ని పంపడం లేదు.. ఒకవేళ పంపినా మీకు చెప్పను కదా” అని చమత్కరించారు. వైమానిక దాడులు చేయడం వేరు, సైనికులను గడ్డపైకి పంపడం వేరు. భూతల యుద్ధం మొదలైతే అమెరికా సైనికుల ప్రాణాలకు ముప్పు పెరుగుతుంది.
ఇరాన్ బలం ఏమిటి? ఇరాన్ వద్ద అత్యాధునిక డ్రోన్లు, మిసైళ్లు మాత్రమే కాకుండా లేబనాన్, ఇరాక్, సిరియా, యెమెన్లలో బలమైన ‘ప్రాక్సీ’ ముఠాలు ఉన్నాయి. అమెరికా సైనికులు అడుగు పెట్టగానే అన్ని వైపుల నుండి దాడులు మొదలవుతాయి. ఇది ప్రపంచ యుద్ధానికి దారితీసే ప్రమాదం ఉంది.
