న్యూఢిల్లీ: పశ్చిమ ఆసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్న వేళ.. అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరియు భారత ప్రధాని నరేంద్ర మోదీ మధ్య జరిగిన సుదీర్ఘ ఫోన్ సంభాషణ ఇప్పుడు ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షించింది. ఇస్లామాబాద్ వేదికగా అమెరికా-ఇరాన్ మధ్య జరిగిన శాంతి చర్చలు అర్ధాంతరంగా విఫలం కావడంతో, తదుపరి పరిణామాలపై చర్చించేందుకు ఈ ఇద్దరు అగ్రనేతలు సుమారు 40 నిమిషాల పాటు ఏకాంతంగా మాట్లాడారు.
ఈ ఏడాదిలో మూడవసారి.. వ్యూహాత్మక అడుగు!
ఫిబ్రవరి 28న ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ దాడుల తర్వాత పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు పతాక స్థాయికి చేరాయి. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ, ట్రంప్ మాట్లాడుకోవడం ఈ ఏడాదిలో ఇది మూడవసారి కాగా, యుద్ధం మొదలయ్యాక రెండవసారి. ఫిబ్రవరి 2న వాణిజ్య ఒప్పందాలపై, మార్చి 24న ప్రాంతీయ భద్రతపై చర్చించిన ఈ ఇద్దరు నేతలు.. ఇప్పుడు ఇరాన్ సంక్షోభంపై అత్యంత కీలకమైన చర్చలు జరిపారు.
ఇస్లామాబాద్‌లో విఫలమైన మంతనాలు:
పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్ వేదికగా అమెరికా-ఇరాన్ ప్రతినిధుల మధ్య సుమారు 21 గంటల పాటు సాగిన సుదీర్ఘ చర్చలు ఎటువంటి ఫలితం లేకుండా ముగిశాయి. రెండు వారాల పాటు అమల్లో ఉన్న తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందాన్ని పొడిగించడంలో ఇరుపక్షాలు విఫలమయ్యాయి. చర్చలు బెడిసికొట్టడానికి ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ సమావేశం నుండి బయటకు వచ్చారు.
అణు కార్యక్రమమే అడ్డంకి!
అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వెన్స్ ఈ చర్చల విఫలంపై స్పందిస్తూ.. “ఇరాన్ తన అణు కార్యక్రమాన్ని పూర్తిగా వదులుకుంటున్నట్లు స్పష్టమైన హామీ ఇవ్వడం లేదు. అణు ఆయుధాల తయారీకి దారితీసే ఏ మార్గాన్ని అయినా వారు మూసివేస్తామనే నమ్మకం కలిగించడంలో విఫలమయ్యారు” అని పేర్కొన్నారు.
మరోవైపు ఇరాన్ ప్రతినిధి బృందానికి నాయకత్వం వహించిన మహమ్మద్ బాకర్ కాలిబాఫ్ స్పందిస్తూ.. “అమెరికా తమ నమ్మకాన్ని ఎలా చూరగొనాలో ఆలోచించుకోవాలి. చర్చలు విఫలం కావడానికి వాషింగ్టన్ వైఖరే కారణం” అని ప్రత్యారోపణలు చేశారు.
భారత్ పాత్రపై ఆసక్తి:
అమెరికా-ఇరాన్ మధ్య సయోధ్య కుదరని పక్షంలో యుద్ధం మళ్లీ తీవ్రరూపం దాల్చే అవకాశం ఉంది. ఈ క్లిష్ట సమయంలో భారత్ తటస్థ వైఖరిని అవలంబిస్తూనే, ప్రపంచ శాంతి కోసం మధ్యవర్తిత్వం వహించగలదని విశ్లేషకులు భావిస్తున్నారు. అందుకే ట్రంప్, ప్రధాని మోదీతో 40 నిమిషాల పాటు చర్చించడం అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది. రాబోయే రోజుల్లో భారత్ ఎలాంటి కీలక పాత్ర పోషిస్తుందో వేచి చూడాలి.
