ఇ-శ్రమ్ (e-Shram) కార్డ్ అంటే ఏమిటి? దీనికి ఎవరు అర్హులు? నిబంధనలు ఏమిటి? దరఖాస్తు చేసుకోవడం ఎలా? వంటి వివరాలను ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
భారతదేశంలోని అసంఘటిత రంగ కార్మికులను (Unorganized Workers) ఒకే డేటాబేస్ కిందికి తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం ఇ-శ్రమ్ కార్డును ప్రారంభించింది. కోట్లాది మంది కార్మికుల భవిష్యత్తుకు రక్షణ కల్పించడానికి ప్రభుత్వం ఒక అద్భుతమైన పెన్షన్ పథకాన్ని అందుబాటులోకి తెచ్చింది. దీని ద్వారా అర్హులైన కార్మికులకు 60 ఏళ్ల తర్వాత ప్రతి నెలా రూ. 3,000 పెన్షన్ లభిస్తుంది.
ఏమిటీ ఇ-శ్రమ్ కార్డ్?
కేంద్ర ప్రభుత్వం ఈ పథకం కింద ప్రతి కార్మికుడికి ఒక ప్రత్యేకమైన డిజిటల్ కార్డును అందిస్తుంది. ఇందులో సదరు కార్మికుడి గుర్తింపు మరియు వృత్తికి సంబంధించిన పూర్తి సమాచారం ఉంటుంది.
ప్రధాన ప్రయోజనాలు:
- రూ. 2 లక్షల వరకు ప్రమాద బీమా.
- 60 ఏళ్ల తర్వాత నెలకు రూ. 3,000 పెన్షన్ (PM-SYM పథకం ద్వారా).
- వివిధ ప్రభుత్వ సంక్షేమ పథకాలు నేరుగా అందుతాయి.
- భారతదేశంలోని 16 నుండి 59 ఏళ్ల మధ్య ఉండి, ఆదాయపు పన్ను చెల్లించని ఏ కార్మికుడైనా ఉచితంగా నమోదు చేసుకోవచ్చు.
అర్హులు ఎవరు?
ఈ పథకం కేవలం అసంఘటిత రంగ కార్మికుల కోసం మాత్రమే.
- ఓలా, ఉబర్, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి సంస్థల్లో పనిచేసే డెలివరీ బాయ్స్/గిగ్ వర్కర్లు.
- దినసరి కూలీలు, భవన నిర్మాణ కార్మికులు.
- వీధి వ్యాపారులు, గృహ కార్మికులు, వ్యవసాయ కూలీలు.
- కుట్టు పని చేసేవారు, క్షురకులు (Barbers) మరియు చిన్న తరహా వృత్తి పనివారు.
కావలసిన పత్రాలు:
- ఆధార్ కార్డు.
- ఆధార్‌తో అనుసంధానించబడిన మొబైల్ నంబర్.
- బ్యాంక్ ఖాతా పుస్తకం (పాస్‌బుక్) నకలు.
తక్షణ ప్రయోజనాలు:
- ప్రమాద బీమా: ప్రమాదవశాత్తు మరణిస్తే రూ. 2 లక్షలు, శాశ్వత అంగవైకల్యం సంభవిస్తే రూ. 1 లక్ష వరకు బీమా అందుతుంది. పాక్షిక వైకల్యానికి రూ. 50 వేలు లభిస్తాయి.
- నేరుగా నగదు బదిలీ: భవిష్యత్తులో విపత్తుల సమయంలో ప్రభుత్వం అందించే ఆర్థిక సాయం నేరుగా మీ బ్యాంక్ ఖాతాకే వస్తుంది.
- జాతీయ గుర్తింపు: ఇది దేశవ్యాప్తంగా చెల్లుబాటు అయ్యే గుర్తింపు కార్డుగా ఉపయోగపడుతుంది.
రూ. 3,000 పెన్షన్ పొందడం ఎలా? (PM-SYM పథకం)
ఇ-శ్రమ్ కార్డుతో పాటు మీరు ప్రధాన మంత్రి శ్రమ యోగి మాన్-ధన్ (PM-SYM) పథకంలో చేరాలి.
- వయస్సు: 18 నుండి 40 ఏళ్ల లోపు ఉండాలి.
- ఆదాయం: నెలకు రూ. 15 వేల కంటే తక్కువ ఉండాలి.
- నిబంధన: మీరు ఆదాయపు పన్ను చెల్లింపుదారు అయి ఉండకూడదు. అలాగే EPFO లేదా ESIC పథకాలలో సభ్యులుగా ఉండకూడదు.
- పొదుపు: వయస్సును బట్టి నెలకు రూ. 55 నుండి రూ. 200 వరకు 60 ఏళ్లు వచ్చే వరకు పొదుపు చేయాలి. మీరు ఎంతైతే జమ చేస్తారో, కేంద్ర ప్రభుత్వం కూడా అంతే మొత్తాన్ని మీ ఖాతాలో జమ చేస్తుంది.
నమోదు చేసుకునే విధానం:
- అధికారిక వెబ్సైట్ https://eshram.gov.in/ కి వెళ్లి, మొబైల్ నంబర్ మరియు OTP ద్వారా లాగిన్ అవ్వండి.
- ఆధార్ మరియు బ్యాంక్ వివరాలను తప్పులు లేకుండా నమోదు చేయండి.
- పెన్షన్ పథకం కోసం దరఖాస్తు చేసేటప్పుడు ‘ఆటో డెబిట్’ (బ్యాంక్ నుండి డబ్బులు కట్ అయ్యే విధానం) సదుపాయాన్ని ఓకే చేయండి.
- చివరగా మీ ఇ-శ్రమ్ కార్డును డౌన్లోడ్ చేసుకోండి.
- ఆన్లైన్లో చేయలేని వారు దగ్గరలోని CSC (మీ సేవ) కేంద్రానికి వెళ్లి ఉచితంగా నమోదు చేసుకోవచ్చు.
గమనిక: ఈ కార్డుపై 12 అంకెల UAN (యూనివర్సల్ అకౌంట్ నంబర్) ఉంటుంది. ఇది జీవితకాలం చెల్లుతుంది, ప్రతి ఏడాది పునరుద్ధరించాల్సిన (Renew) అవసరం లేదు. చందాదారుడు మరణిస్తే, అతని భాగస్వామికి (భార్య/భర్త) 50% పెన్షన్ అందుతుంది.
