మీ వాట్సాప్‌కు తెలిసిన వ్యక్తుల నుండి ‘ఈ ఫోటో చూడు’ (Look at this photo) అని మెసేజ్ వచ్చిందా? జాగ్రత్త! ఆ మెసేజ్ మీ వ్యక్తిగత జీవితంలోకి తొంగిచూసే హ్యాకర్ పంపింది కావచ్చు. భారత సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ ‘CERT-In’ వాట్సాప్ యొక్క ‘డివైజ్-లింకింగ్’ ఫీచర్‌లో ఉన్న ఒక పెద్ద సాంకేతిక లోపాన్ని గుర్తించింది. దీనికి ‘ఘోస్ట్ పెయిరింగ్’ (GhostPairing) అని పేరు పెట్టారు.
ఈ పద్ధతిలో సైబర్ నేరగాళ్లు ఎటువంటి పాస్‌వర్డ్ లేదా సిమ్ స్వాపింగ్ అవసరం లేకుండానే మీ వాట్సాప్‌ను పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకోగలరని తేలింది.
‘ఘోస్ట్ పెయిరింగ్’ అంటే ఏమిటి? హ్యాకర్లు తమ డివైజ్‌ను మీ వాట్సాప్ అకౌంట్‌కు మీకు తెలియకుండానే లింక్ చేస్తారు. ఇది వాట్సాప్ వెబ్ లాగే పనిచేస్తుంది. దీనివల్ల హ్యాకర్ మీ మెసేజ్‌లను రియల్-టైమ్‌లో చదవడమే కాకుండా, మీ తరపున ఇతరులకు మెసేజ్‌లు కూడా పంపగలడు.
ఈ సైబర్ దాడి ఎలా జరుగుతుంది?
- ఒక లింక్‌తో ప్రారంభం: వినియోగదారుడికి నమ్మకమైన వ్యక్తి నుండి ‘హాయ్, ఈ ఫోటో చూడు’ అని మెసేజ్ వస్తుంది. అందులో ఫేస్‌బుక్ లాగా కనిపించే ఒక లింక్ ఉంటుంది.
- నకిలీ వెరిఫికేషన్: ఆ లింక్‌పై క్లిక్ చేయగానే ఒక నకిలీ పేజీ ఓపెన్ అవుతుంది. అక్కడ కంటెంట్ చూడాలంటే ‘వెరిఫై’ చేయాలని కోరుతూ ఒక కోడ్ కనిపిస్తుంది.
- హ్యాకర్ యాక్సెస్: వినియోగదారుడు తెలియక ఆ కోడ్‌ను ఉపయోగించిన వెంటనే, హ్యాకర్ బ్రౌజర్ మీ వాట్సాప్‌తో లింక్ అయిపోతుంది. దీనితో మీ చాట్స్, ఫోటోలు, వీడియోలన్నీ హ్యాకర్ చేతిలోకి వెళ్తాయి.
హైజాక్ నుండి మిమ్మల్ని మీరు ఎలా కాపాడుకోవాలి?
- అపరిచిత లింకులు వద్దు: తెలిసిన వారు పంపినా సరే, అనుమానాస్పద లింకులపై క్లిక్ చేయకండి.
- లింక్డ్ డివైజెస్ తనిఖీ చేయండి: వాట్సాప్ సెట్టింగ్స్‌లోని ‘Linked Devices’ లోకి వెళ్లి ఏవైనా తెలియని డివైజ్‌లు ఉన్నాయేమో తరచుగా చెక్ చేసుకోండి. ఉంటే వెంటనే ‘Log Out’ చేయండి.
- పెయిరింగ్ కోడ్ షేర్ చేయవద్దు: వాట్సాప్ అడగకుండా లేదా మీకు అవసరం లేకుండా ఎటువంటి పెయిరింగ్ కోడ్‌ను ఎంటర్ చేయకండి.
- టూ-స్టెప్ వెరిఫికేషన్: మీ వాట్సాప్‌లో ‘Two-step verification’ను ఎల్లప్పుడూ ఆన్‌లో ఉంచుకోండి.
- మొబైల్ ఇతరులకు ఇవ్వకండి: మీ మొబైల్‌ను ఎవరికీ ఇవ్వకండి, అది మోసాలకు దారితీయవచ్చు.
