ప్రేమకు దేన్నైనా జయించగల అద్భుత శక్తి ఉంటుంది. ప్రతి మతంలోనూ ప్రేమకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. అయితే నిజమైన ప్రేమ అనేది మనసు నుంచి రావాలి తప్ప, అది బలవంతంగా ఉండకూడదు. ఈ విషయాన్ని అర్థం చేసుకుని, తన ప్రేమ కోసం వృత్తిని త్యాగం చేసి ఒక ముస్లిం మత గురువును వివాహం చేసుకున్న నటి సనా ఖాన్.
హీరోయిన్ సనా ఖాన్.. గగనం, కత్తి, మిస్టర్ నూకయ్య వంటి తెలుగు సినిమాల్లో నటించింది. తమిళ, హిందీ చిత్రాల్లోనూ యాక్ట్ చేసింది. హిందీ బిగ్‌బాస్ 6వ సీజన్లో పాల్గొని మరింత పాపులర్ అయింది. ఆరేళ్ల క్రితం అంటే 2020లో సినిమాలకు గుడ్‌బై చెప్తున్నట్లు ప్రకటించింది. ఆ తర్వాతి నెలలో ముఫ్తీ అనాజ్‌ను పెళ్లి చేసుకోగా వీరికి ఇద్దరు పిల్లలు సంతానం.
2020 ప్రాంతంలో చిత్ర పరిశ్రమకు స్వస్తి చెప్పారు. “సినీ పరిశ్రమ నాకు పేరు, డబ్బు, గౌరవం అన్నీ ఇచ్చింది. కానీ మనిషి కేవలం డబ్బు సంపాదించడానికే భూమిపైకి వస్తాడా? పేరు, డబ్బు కోసం జీవితమంతా గడపకూడదని నాకు అర్థమైంది. అందుకే నేను రంగుల ప్రపంచం నుండి దూరంగా వెళ్తున్నాను” అని చెబుతూ మేకప్‌కు దూరమయ్యారు.
ఆ తర్వాత నవంబర్ 21, 2020న సూరత్‌లో ముస్లిం మత గురువు ముఫ్తీ అనాస్ సయ్యద్‌ను ఆమె వివాహం చేసుకున్నారు. అల్లా దయవల్లే తాము కలిశామని, పెళ్లి చేసుకున్నామని ఆమె పేర్కొన్నారు. జూలై 5, 2023న వీరికి మొదటి సంతానం కలిగింది. గత ఏడాది మరో మగబిడ్డకు కూడా ఆమె జన్మనిచ్చారు.
అయితే సనా ఖాన్ అకస్మాత్తుగా చిత్ర పరిశ్రమకు వీడ్కోలు పలకడం వెనుక ఆమె భర్త ముఫ్తీ అనాస్ సయ్యద్ బ్రెయిన్ వాష్ చేశారని, ఆయనే ఆమెను బలవంతంగా మత మార్గంలోకి మళ్లించారని చాలా మంది అనుమానించారు. తాజాగా ఈ అనుమానాలపై సనా ఖాన్ స్పందించారు.
హిందీ ‘బిగ్ బాస్ 13’ కంటెస్టెంట్ రష్మీ దేశాయ్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సనా ఖాన్ మాట్లాడుతూ.. ఎవరూ ఎవరినీ బ్రెయిన్ వాష్ చేయలేరని చెప్పారు. ఒక వ్యక్తికి కేవలం పేరు, డబ్బు మాత్రమే కాదు, మనశ్శాంతి కూడా ముఖ్యమని ఆమె అన్నారు. సమయం గడిచేకొద్దీ తాను చాలా విషయాలు నేర్చుకున్నానని, అందుకే తన భర్తతో ఉన్న బంధానికి ఎంతో విలువ ఇస్తానని చెప్పారు. తన భర్త కంటే గొప్ప వ్యక్తిని తాను వెతకలేనని ఆమె పేర్కొన్నారు.
పెళ్లికి ముందే తాను చిత్ర పరిశ్రమకు దూరం కావాలని ఆలోచించానని, తనలో మార్పులు మొదలయ్యాయని సనా చెప్పారు. “దీని వెనుక నా భర్త హస్తం లేదు, నేనే స్వయంగా ఈ నిర్ణయం తీసుకున్నాను. ఆ మార్గంలో నడవడానికి నా భర్త నాకు సరైన మార్గదర్శకత్వం మాత్రమే ఇచ్చారు” అని ఆమె స్పష్టం చేశారు.
