ఉదయం నిద్రలేవగానే ఈ 5 పనులు తప్పకుండా చేయండి!

ఉదయం నిద్రలేవగానే శారీరక ఆరోగ్యం కోసం కొన్ని అలవాట్లను పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు. చాలామందికి ఉదయం లేవగానే కాఫీ లేదా టీ తాగి రోజువారీ పనులను ప్రారంభించడం అలవాటు. కానీ, ఆరోగ్యకరమైన శరీరం మరియు మనస్సు కోసం ఉదయం పూట కొన్ని పనులు తప్పనిసరిగా చేయాలి. ఇలా చేయడం వల్ల మొత్తం ఆరోగ్యం మెరుగుపడటమే కాకుండా, ప్రస్తుతం చాలామందిని వేధిస్తున్న నిద్రలేమి సమస్యలు కూడా తగ్గుతాయని పరిశోధనలు చెబుతున్నాయి.

  1. సూర్యరశ్మి అవసరం: ఉదయం లేవగానే శరీరానికి ఎండ తగలాలి. దీనివల్ల శరీరంలోని ‘సిర్కాడియన్ రిథమ్’ (Circadian Rhythm) క్రమబద్ధం అవుతుంది. కొద్దిపాటి సూర్యరశ్మిని గ్రహించినా రాత్రిపూట నిద్ర బాగా పడుతుంది. మెదడు చురుగ్గా పనిచేస్తుంది. ఉదయం 10 గంటల కంటే ముందు కనీసం 30 నిమిషాలు ఎండలో ఉండటం వల్ల నిద్ర నాణ్యత పెరుగుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి.
  2. ఫోన్‌కు దూరంగా ఉండండి: రాత్రి పడుకునే ముందు, ఉదయం లేవగానే ఫోన్ చూడటం అందరికీ అలవాటుగా మారింది. కానీ, నిద్రలేచిన తర్వాత కనీసం 45 నిమిషాల వరకు స్మార్ట్‌ఫోన్‌ను వాడకూడదని వైద్యులు చెబుతున్నారు. ఫోన్ నుండి వచ్చే కాంతి శరీరంలో ఒత్తిడిని కలిగించే హార్మోన్లను ప్రేరేపిస్తుంది. అలాగే రాత్రి పడుకోవడానికి గంట ముందు కూడా ఫోన్‌ను పక్కన పెట్టేయాలి.
  3. ఉదయం వ్యాయామం: ప్రస్తుత కాలంలో శారీరక శ్రమ లేకపోవడం వల్లనే అనేక ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. ఉదయం లేవగానే కాసేపు నడవడం, పరిగెత్తడం వంటి తేలికపాటి వ్యాయామాలు చేయడం వల్ల ఒత్తిడి తగ్గి, రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. దీనివల్ల రాత్రి ప్రశాంతమైన నిద్ర పడుతుంది.
  4. అల్పాహారం (Breakfast): ఉదయం అల్పాహారాన్ని మానేయడం ఆరోగ్యానికి చాలా ప్రమాదకరం. ఉదయం త్వరగా అల్పాహారం తీసుకోవాలి. అందులోనూ గుడ్లు, పెరుగు, నట్స్ వంటి ప్రోటీన్లు అధికంగా ఉండేలా చూసుకోవాలి. కార్బోహైడ్రేట్లు, మంచి కొవ్వులతో కూడిన సమతుల్య ఆహారం తీసుకోవాలి. అర్ధరాత్రి భోజనం చేయడం పూర్తిగా మానేయాలి.
  5. సరైన సమయానికి మేల్కొనడం: రాత్రి ఆలస్యంగా పడుకున్నప్పటికీ, ఉదయం పూట ప్రతిరోజూ ఒకే సమయానికి నిద్రలేవడాన్ని అలవాటు చేసుకోవాలి. ఉదాహరణకు ప్రతిరోజూ ఉదయం 6 గంటలకే నిద్రలేవాలి. వారాంతాల్లో లేదా సెలవు దినాల్లో ఈ సమయంలో కాస్త మార్పులు చేసుకోవచ్చు.

Posted

in

by

Tags: