ఉద్యోగి శాలరీ అకౌంట్‌లో పడ్డ రూ. 1.42 కోట్లు; పొరపాటున పంపించాం తిరిగి ఇచ్చేయమన్న కంపెనీ.. రాజీనామా చేసి పారిపోయిన ఉద్యోగి!

ప్రతి ఉద్యోగి కూడా నెలలో ఒకటో తేదీ కోసం ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తుంటాడు. ఎందుకంటే ఆ రోజే వారి అకౌంట్‌లో జీతం (శాలరీ) పడుతుంది. నెల ప్రారంభంలో వచ్చే జీతం ఇచ్చే కిక్కే వేరుగా ఉంటుంది. ఆ రోజుల్లో ఉద్యోగి జేబు నిండుగా ఉండటం వల్ల తన ఇష్టాలన్నింటినీ తీర్చుకుంటాడు.

అలాగే పెండింగ్‌లో ఉన్న బిల్లులన్నింటినీ చెల్లిస్తాడు. అందుకే ఒకటో తేదీన మొబైల్‌కు ‘శాలరీ క్రెడిట్’ అయినట్లు మెసేజ్ రాగానే ఉద్యోగులు ఆనందంతో గంతులేస్తారు.

అయితే, ఒకవేళ ఏదైనా కంపెనీ మీకు రావాల్సిన జీతం కంటే పొరపాటున కోట్ల రూపాయలు ఎక్కువ చెల్లిస్తే ఏం జరుగుతుందో ఒక్కసారి ఊహించండి! మీ అకౌంట్‌లోకి కంపెనీకి చెందిన కోట్ల రూపాయలు పొరపాటున వచ్చేస్తే.. ఖచ్చితంగా అది చూసి మీ మైండ్ బ్లాక్ అవుతుంది. ఇలాంటి పరిస్థితిలో మీరు ఏం చేస్తారో తెలీదు కానీ, ఒక వ్యక్తి మాత్రం కంపెనీకి రాజీనామా ఇచ్చేసి మాయమవ్వడమే మంచిదని భావించాడు.

ఉద్యోగికి పొరపాటున కోట్ల రూపాయల జీతం ఇచ్చిన కంపెనీ
దక్షిణ అమెరికాలోని చిలీ (Chile) దేశంలో ‘ఫుడ్ ఇండస్ట్రియల్ కన్సార్టియం’ (Cial) అనే కంపెనీ తన ఉద్యోగికి పొరపాటున అతని అసలు జీతం కంటే 286 రెట్లు ఎక్కువ జీతాన్ని చెల్లించింది. ఈ ఉద్యోగి అసలు జీతం 500,000 పెసోలు (భారత కరెన్సీలో దాదాపు రూ. 43,000). కానీ, కంపెనీ పొరపాటున అతని బ్యాంక్ అకౌంట్‌లో ఏకంగా 165,398,851 చిలీ పెసోలను (దాదాపు రూ. 1.42 కోట్లు) జమ చేసింది.

ఈ సియాల్ (Cial) కంపెనీ కింద శాన్ జార్జ్, లా ప్రిఫెరిడా మరియు వింటర్ వంటి ప్రధాన చిలీ బ్రాండ్లు ఉన్నాయి. ఇది ‘సెసినాస్’ (cecinas) తయారు చేసే అతిపెద్ద కంపెనీ. సెసినాస్ అనేది స్పానిష్ మూలానికి చెందిన ఒక రకమైన ఎండిన మాంసం (Dehydrated meat). అయితే, కంపెనీ పొరపాటున పడిన ఆ అదనపు డబ్బును తిరిగి ఇచ్చేయమని అడగడంతో, ఆ ఉద్యోగి కూడా ఖచ్చితంగా తిరిగి ఇచ్చేస్తానని మొదట నమ్మబలికాడు.

రాజీనామా లేఖ ఇచ్చి వెళ్ళిపోయాడు!
కానీ ఆ తర్వాత, ఆ ఉద్యోగి తన లాయర్‌తో కలిసి కంపెనీకి వచ్చి, తన ఉద్యోగానికి రాజీనామా లేఖ (రిజైన్ లెటర్) ఇచ్చి వెళ్ళిపోయాడు. కంపెనీ డబ్బునంతా త్వరలోనే తిరిగి ఇచ్చేస్తానని అప్పుడు కూడా ప్రామిస్ చేశాడు. కానీ ఆ తర్వాత అతను అలా మాయమయ్యాడు, ఇప్పటివరకు అతని ఆచూకీ ఎవరికీ దొరకలేదు.

ఉద్యోగికి పొరపాటున ఎక్కువ డబ్బులు పడ్డాయనే విషయం కంపెనీకి మే 30న తెలిసింది. కాగా, జూన్ 2న ఆ ఉద్యోగి కంపెనీకి రాజీనామా లేఖ ఇచ్చి రఫ్ఫూచక్కర్ అయ్యాడు. ఈ విచిత్రమైన ఉదంతం ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.

ఒకవేళ మీ కంపెనీ కూడా మీ అకౌంట్‌లో పొరపాటున కోట్ల రూపాయలు వేస్తే మీరు ఏం చేస్తారు? అతనిలాగే పారిపోతారా లేక కంపెనీకి డబ్బులు తిరిగి ఇచ్చేస్తారా? మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఈ వార్తను మీ బాస్ మరియు ఆఫీస్ సహచరులతో షేర్ చేసుకోండి.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *