ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన మానవుడిగా పేరొందిన జమైకా స్ప్రింట్ దిగ్గజం ఉసేన్ బోల్ట్ 100 మీటర్ల ప్రపంచ రికార్డును, చైనాకు చెందిన ‘అల్ట్రా’ (టియాంగాంగ్ అల్ట్రా) అనే హ్యూమనాయిడ్ రోబో (మానవ రూప రోబో) బద్దలు కొట్టి సరికొత్త చరిత్ర సృష్టించింది.
చైనా రాజధాని బీజింగ్‌లో హ్యూమనాయిడ్ రోబోల కోసం నిర్వహించిన ప్రత్యేక 100 మీటర్ల పరుగు పందెం పోటీలు జరిగాయి. ఇందులో ప్రపంచవ్యాప్తంగా ఉన్న పలు అగ్రశ్రేణి సాంకేతిక పరిశోధన సంస్థల రోబోలు పాల్గొని తమ వేగాన్ని, సామర్థ్యాన్ని నిరూపించుకునేందుకు తీవ్రంగా పోటీ పడ్డాయి.
ఈ హై-స్పీడ్ పరుగు పందెంలో పాల్గొన్న ‘అల్ట్రా’ రోబో 100 మీటర్ల దూరాన్ని కేవలం 9.39 సెకన్లలోనే పూర్తి చేసి గమ్యాన్ని చేరుకుంది. 2009 బెర్లిన్ వరల్డ్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో ఉసేన్ బోల్ట్ 100 మీటర్లను 9.58 సెకన్లలో పూర్తి చేయడమే ఇప్పటివరకు ప్రపంచ రికార్డుగా ఉండగా.. తాజాగా అల్ట్రా రోబో ఆ రికార్డును తిరగరాసి సంచలనం సృష్టించింది.
అంతేకాకుండా, ఇదే రేసులో పోటీపడిన హానర్ (Honor) సంస్థకు చెందిన ‘లైట్నింగ్’ అనే మరో రోబో కూడా 100 మీటర్ల దూరాన్ని 9.47 సెకన్లలో పూర్తి చేసి, బోల్ట్ రికార్డు కంటే ముందే వచ్చి రెండో స్థానంలో నిలిచింది. మనుషుల శారీరక పరిమితులను దాటి రోబోలు నమోదు చేసిన ఈ రికార్డు సమయాలు, అంతర్జాతీయ క్రీడా మరియు టెక్నాలజీ వర్గాల్లో తీవ్ర ఆశ్చర్యాన్ని, సరికొత్త చర్చను రేకెత్తిస్తున్నాయి.

Leave a Reply