టూరిజం డెస్క్: ప్రకృతి ఒడిలో సేదదీరాలని, చల్లని గాలుల మధ్య కాలాన్ని మరచిపోవాలని ఎవరికి ఉండదు? బిజీగా సాగే నగర జీవితం నుండి కాస్త విరామం దొరికితే చాలు.. మనసు హిల్ స్టేషన్ల వైపు పరుగులు తీస్తుంది. దక్షిణ భారతదేశం అనగానే మనకు వెంటనే గుర్తొచ్చేవి ఊటీ, మూన్నార్, కొడైకెనాల్. కానీ, ఈ మధ్య కాలంలో అక్కడ పర్యాటకుల రద్దీ పెరిగిపోవడంతో అసలైన ప్రశాంతత కరువవుతోంది.
అందుకే, ఈసారి రొటీన్‌కు భిన్నంగా.. అడవి అందాలు, మేఘాల ముసుగులు, ఎటుచూసినా పచ్చదనంతో అలరారే కొన్ని అద్భుతమైన ప్రదేశాల గురించి తెలుసుకుందాం. రద్దీ లేని, ప్రశాంతమైన వాతావరణాన్ని కోరుకునే వారికి ఇవి స్వర్గధామాలు.
1. అగుంబే (కర్ణాటక): దక్షిణ భారత చిరపుంజీ
దక్షిణ భారతదేశంలో అత్యధిక వర్షపాతం నమోదయ్యే ప్రాంతం అగుంబే. ఇక్కడి దట్టమైన వర్షారణ్యాలు, జలపాతాలు పర్యాటకులను మంత్రముగ్ధులను చేస్తాయి. ముఖ్యంగా ఇక్కడి సూర్యాస్తమయం (Sunset) పాయింట్ ప్రపంచ ప్రసిద్ధి చెందింది. వైవిధ్యమైన జీవజాతులకు ఇది నిలయం.
2. అరకు వ్యాలీ (ఆంధ్రప్రదేశ్): కాఫీ తోటల స్వర్గం
ఆంధ్రప్రదేశ్‌లోని అరకు లోయ ప్రకృతి ప్రేమికులకు కేరాఫ్ అడ్రస్. ఇక్కడి కాఫీ తోటలు, బొర్రా గుహలు, గిరిజన సంస్కృతి విశిష్టమైనవి. విశాఖపట్నం నుండి అరకు వెళ్లే రైలు ప్రయాణం.. సొరంగాలు, కొండల మధ్య సాగుతూ మధురమైన అనుభూతిని మిగిలిస్తుంది.
3. కొల్లి హిల్స్ (తమిళనాడు): 70 మలుపుల సాహసం
సాహసయాత్రలను ఇష్టపడే వారికి కొల్లి హిల్స్ సరైన ఎంపిక. ఇక్కడికి చేరుకోవాలంటే ఏకంగా 70 హెయిర్‌పిన్ బెండ్‌లను దాటాల్సి ఉంటుంది. ఎత్తైన జలపాతాలు, పురాతన ఆలయాలతో ఈ ప్రాంతం ఆధ్యాత్మికతకు, ప్రకృతికి నిలయంగా ఉంది.
4. కోటగిరి (తమిళనాడు): ఊటీకి అసలైన ప్రత్యామ్నాయం
ఊటీకి అతి సమీపంలోనే ఉన్నా.. రద్దీకి దూరంగా ప్రశాంతంగా ఉంటుంది కోటగిరి. విశాలమైన తేయాకు తోటలు, ట్రెకింగ్ మార్గాలు ఇక్కడి ప్రత్యేకత. ఊటీ కంటే చల్లగా, నిశ్శబ్దంగా ఉండటం వల్ల చాలామంది ఇప్పుడు కోటగిరి వైపు మొగ్గు చూపుతున్నారు.
5. పొన్ముడి (కేరళ): మేఘాల పల్లకి
తిరువనంతపురం సమీపంలో ఉండే పొన్ముడి.. ఎప్పుడూ మంచుతో కప్పబడి ఉంటుంది. వంకరటింకర రోడ్లు, కొండచరియల మధ్య పచ్చదనం పర్యాటకులకు సరికొత్త ఉత్సాహాన్ని ఇస్తాయి. రద్దీ తక్కువగా ఉండే ఈ హిల్ స్టేషన్ ఏకాంతంగా గడపాలనుకునే వారికి ఉత్తమ ప్రదేశం.
6. యర్కాడ్ (తమిళనాడు): పేదల ఊటీ
ఊటీ నీడలో ఎప్పుడూ మరుగునపడిపోయే అందమైన హిల్ స్టేషన్ యర్కాడ్. తక్కువ ఖర్చుతో అద్భుతమైన వ్యూ పాయింట్లు, కాఫీ తోటలు, ప్రశాంతమైన సరస్సును ఇక్కడ చూడవచ్చు. కుటుంబంతో కలిసి వీకెండ్ గడపడానికి ఇది సరైన చోటు.
