ఒక రెస్టారెంట్లో తన కుటుంబంతో కలిసి డిన్నర్ చేస్తున్న ఒక భారతీయ వ్యక్తి వద్దకు వచ్చిన ఓ మహిళ, అకస్మాత్తుగా జాత్యహంకార ధోరణితో మాట్లాడిన ఘటన తీవ్ర కలకలం రేపింది.
ఎలాంటి కారణం లేకుండా ఆ టేబుల్ వద్దకు వచ్చిన ఆ మహిళ.. “మీరు భారతీయుడైనప్పటికీ మంచి సువాసన వస్తున్నారు, మీ దగ్గర ఎలాంటి కర్రీ వాసన రావట్లేదు” అంటూ వ్యాఖ్యానించడం అక్కడున్న వారిని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.
జాత్యహంకారం నిండిన ఆ మహిళ వ్యాఖ్యలను సదరు భారతీయ వ్యక్తి ఎంతో ప్రశాంతంగా, సంయమనంతో ఎదుర్కొన్నారు. “మీరు అంటున్న మాటలు ప్రశంసలా ఏమీ అనిపించట్లేదు” అని ముఖం మీదే సూటిగా చెప్పిన ఆయన.. “ఇతరులతో మాట్లాడేటప్పుడు ఎలాంటి పదాలు వాడాలో తెలుసుకుని మీ ప్రవర్తనను మార్చుకోండి” అంటూ ఆ మహిళకు చాలా హుందాగా, చురకలంటిస్తూ హితవు పలికారు.
ఆయన నుంచి వచ్చిన ఈ ఊహించని సమాధానంతో షాకైన ఆ మహిళ, మరింత మాట్లాడలేక అక్కడి నుంచి వేగంగా వెళ్లిపోయింది. రెస్టారెంట్లో జరిగిన ఈ మొత్తం ఉదంతం వీడియోగా రికార్డై, ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.
భారతీయులను ఉద్దేశించి ‘కర్రీ వాసన వస్తుంది’ అంటూ మాట్లాడటం చాలాకాలంగా వారిని కించపరచడానికి, హేళన చేయడానికి ఉపయోగించే ఒక రకమైన పరోక్ష జాత్యహంకార ధోరణి. మెచ్చుకుంటున్నట్లు నటిస్తూ అవమానించే ఇలాంటి కుటిల జాతివివక్ష వ్యాఖ్యలపై ఈ ఘటన నెట్టింట పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది.
ఆవేశపడి గొడవ పడకుండా, అత్యంత హుందాగా ఆ మహిళ అహంకారాన్ని ఎండగట్టిన ఆ భారతీయుడి సమయస్ఫూర్తికి నెటిజన్లు, ప్రజలు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
