సాధారణంగా మనం ఎక్స్పైరీ డేట్ ముగియగానే మందులను పారేస్తాం. కానీ ఆ మందులు పూర్తిగా పాడైపోతాయని మీరు అనుకుంటున్నారా? ఐసీయూ (ICU) ఫార్మాసిస్ట్ జేరెడ్ స్టాక్వెల్ ప్రకారం, ఎక్స్పైరీ డేట్ అంటే ఆ మందు పనికాలం ముగిసిందని కాదు. శాస్త్ర సాంకేతికత ప్రకారం, చాలా మందులు వాటి గడువు ముగిసిన చాలా కాలం తర్వాత కూడా సమర్థవంతంగా పనిచేస్తాయి.
ఎక్స్పైరీ డేట్ ఎలా నిర్ణయిస్తారు? 1979లో అమెరికాకు చెందిన ఎఫ్.డి.ఏ (FDA) ఆహార పదార్థాలపై ఎక్స్పైరీ డేట్ ఉండాలని నిబంధన తెచ్చింది. ఆ తర్వాత మందులకు కూడా దీనిని వర్తింపజేశారు. మందుల కంపెనీలు ‘స్టెబిలిటీ టెస్ట్’ (స్థిరత్వ పరీక్ష) చేసి, ఆ తేదీ వరకు మందు పనితీరుకు 100% గ్యారెంటీ ఇస్తాయి. అంటే ఆ తేదీ దాటిన వెంటనే మందు విషంగా మారుతుందని కాదు, దాని ప్రభావం క్రమంగా తగ్గుతుందని అర్థం. మందులను చల్లని, పొడి ప్రదేశంలో, వెలుతురు తగలకుండా భద్రపరిస్తే అవి చాలా కాలం పాడవకుండా ఉంటాయి.
పరిశోధనలో తేలిన నమ్మలేని నిజాలు: 1986లో ఎఫ్.డి.ఏ చేసిన ఒక అధ్యయనంలో ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగుచూశాయి. గడువు ముగిసిన మందులపై పరీక్షలు నిర్వహించగా, సుమారు 88% మందులు గడువు ముగిసిన సగటున 66 నెలల (5 ఏళ్ల పైగా) తర్వాత కూడా సమానమైన ప్రభావాన్ని కలిగి ఉన్నాయని తేలింది. కొన్ని మందులు 10-15 ఏళ్ల వరకు కూడా పనిచేయడం గమనార్హం. అంటే క్యాలెండర్ తేదీ కంటే మందును భద్రపరిచే విధానమే (Storage) ముఖ్యం.
ఎక్కువ కాలం మన్నే మందులు: టాబ్లెట్లు (Solid Tablets) ద్రవ రూపంలో ఉండే మందుల కంటే ఎక్కువ కాలం మన్నుతాయి.
- నొప్పి నివారణలు: ఐబూప్రోఫెన్, ఎసిటమినోఫెన్ వంటివి.
- అలెర్జీ మందులు: యాంటీ హిస్టామైన్లు. ఇవి సీల్ సరిగ్గా ఉండి, సరైన ప్రదేశంలో ఉంచితే ఏళ్ల తరబడి పనిచేస్తాయి. ద్రవ రూపంలో ఉండే మందులు (Syrups/Injectables) త్వరగా విచ్ఛిన్నం అవుతాయి.
వెంటనే పారేయాల్సిన మందులు (జాగ్రత్త!): కొన్ని మందులు గడువు ముగిస్తే అస్సలు వాడకూడదు. అవి:
- ఇన్సులిన్: ఇది త్వరగా పాడైపోతుంది, ఫలితంగా బ్లడ్ షుగర్ నియంత్రణ తప్పుతుంది.
- ఎపినెఫ్రిన్ (EpiPen): అలెర్జీ ఎటాక్ వచ్చినప్పుడు ఇది పనిచేయకపోతే ప్రాణాలకే ప్రమాదం.
- గుండె సంబంధిత మందులు (Nitroglycerin): ఇవి వెంటనే ప్రభావం కోల్పోతాయి.
- లిక్విడ్ యాంటీబయాటిక్స్: వీటిలో బ్యాక్టీరియా చేరే అవకాశం ఉంది.
- టెట్రాసైక్లిన్ (పాతవి): గడువు ముగిసిన టెట్రాసైక్లిన్ విషపూరితంగా మారి కిడ్నీలను దెబ్బతీసే అవకాశం ఉంది. దీనికి దూరంగా ఉండాలి.
మందుల వాడకంలో స్మార్ట్ చిట్కాలు: మీ దగ్గర ఉన్న టాబ్లెట్ బాటిల్ ఎక్స్పైరీ డేట్ ముగిసి కొన్ని నెలలు లేదా రెండేళ్లు అయినా.. ఆ టాబ్లెట్ రంగు మారకపోయినా, దుర్వాసన రాకపోయినా దానిని వాడవచ్చు. అయితే ద్రవ రూపంలో ఉండే మందులు (Syrups) వాడకపోవడమే మంచిది. మీకు ఏమాత్రం అనుమానం ఉన్నా, లేదా అది పనిచేయదు అని మీ మనసులో అనిపిస్తే, దానిని వాడకుండా కొత్త మందు తీసుకోవడమే సురక్షితం.
