ఎటర్నల్ లిమిటెడ్ గ్రూప్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO) పదవి నుండి దీపిందర్ గోయల్ తప్పుకుంటున్నారు. తక్షణమే అమల్లోకి వచ్చేలా ఆయన కంపెనీ వైస్ ఛైర్మన్‌గా బాధ్యతలు చేపడతారు. 18 ఏళ్ల క్రితం ఆయనే ఈ సంస్థను స్థాపించారు.
గోయల్ స్థానంలో ఆయన ప్రాణ స్నేహితుడు, బ్లింకిట్ (Blinkit) CEO అయిన అల్బిందర్ ధీండా గ్రూప్ CEOగా బాధ్యతలు చేపట్టనున్నారు.
“ఇటీవలి కాలంలో, అధిక రిస్క్‌తో కూడిన సరికొత్త ఆలోచనల వైపు నేను ఆకర్షితుడవుతున్నాను. ఎటర్నల్ వంటి పబ్లిక్ లిమిటెడ్ కంపెనీలో ఉండి అటువంటి ప్రయోగాలు చేయడం సరైనది కాదని నా భావన” అని గోయల్ షేర్ హోల్డర్లకు రాసిన లేఖలో పేర్కొన్నారు.
షేర్ హోల్డర్లకు రాసిన లేఖలోని ముఖ్యాంశాలు:
ఎందుకు ఈ మార్పు? “నేను చేయాలనుకుంటున్న కొత్త ఆలోచనలు ఎటర్నల్ వ్యూహాలకు లోబడి ఉంటే, నేను కంపెనీలోనే కొనసాగేవాడిని. కానీ అవి వేరైనవి. ఎటర్నల్ తన ప్రస్తుత వ్యాపారంపై పూర్తి దృష్టిని, క్రమశిక్షణను కొనసాగించాల్సిన అవసరం ఉంది. నేను వ్యక్తిగతంగా రెండు పనులు చేయగలిగినప్పటికీ, భారతదేశంలో ఒక పబ్లిక్ కంపెనీ CEOగా కొన్ని చట్టపరమైన బాధ్యతలు, అంచనాలు ఉంటాయి. అవి ఏకాగ్రతను కోరుతాయి. అందుకే నేను ఈ నిర్ణయం తీసుకున్నాను.”
ఏమి మారదు? “నా జీవితంలో సగం కాలం, అంటే 18 ఏళ్లు ఈ కంపెనీని నిర్మించడానికే కేటాయించాను. అది అలాగే కొనసాగుతుంది. అల్బి (అల్బిందర్), అక్షాంత్ మరియు నేను ఎప్పటిలాగే కలిసి పని చేస్తాం. దీర్ఘకాలిక వ్యూహాలు, కంపెనీ సంస్కృతి, నాయకత్వ అభివృద్ధి మరియు నైతిక విలువలపై నా పర్యవేక్షణ ఉంటుంది.”
ఏమి మారుతుంది? “కంపెనీ కార్యకలాపాలకు సంబంధించిన కీలక నిర్ణయాధికారం ఇకపై అల్బిందర్ ధీండాకు ఉంటుంది. గ్రూప్ CEOగా రోజువారీ నిర్వహణ, వ్యాపార ప్రాధాన్యతలు ఆయనే చూసుకుంటారు. బ్లింకిట్ సంస్థను లాభాల బాటలోకి తీసుకురావడంలో ఆయన నాయకత్వం అద్భుతమైనది. నాకంటే మెరుగ్గా అమలు చేసే సామర్థ్యం ఆయనకు ఉంది.”
ESOPల గురించి: “ఈ మార్పులో భాగంగా, నాకు రావాల్సిన అన్‌వెస్టెడ్ (Unvested) ESOPలన్నింటినీ తిరిగి కంపెనీ పూల్కే ఇచ్చేస్తున్నాను. దీనివల్ల కంపెనీలోని తర్వాతి తరం నాయకులకు సంపద సృష్టించే అవకాశాలు మెరుగవుతాయి.”
భవిష్యత్తు లక్ష్యం: “18 ఏళ్ల క్రితం ఒక మెనూ స్కానింగ్ కంపెనీ (జొమాటో ప్రారంభ రూపం) వేల కోట్ల విలువైన సంస్థగా మారుతుందని ఎవరూ ఊహించలేదు. కానీ మేము అది సాధ్యమని నిరూపించాం. ఎటర్నల్ సంస్థను భారతదేశంలోనే అత్యంత విలువైన కంపెనీగా చూడాలని, కోట్లాది మందికి ఉపాధి కల్పించాలని నేను కోరుకుంటున్నాను. నా హోదా మారినా, కంపెనీ పట్ల నా నిబద్ధత మారదు.” – దీపిందర్ గోయల్
