ఎడ్లబండి పందెల రారాజు ‘హెలికాప్టర్ బైజ్యా’.. బహుమతిగా ఫార్చ్యూనర్ కారు!

అది ఆరున్నర కిలోమీటర్ల ఎడ్లబండి పరుగు పందెం. ధృడమైన ఆ ఎడ్లు మెరుపు వేగంతో బండిని లాగుతూ పరుగెత్తడం ప్రారంభించాయి. సగం దూరం రాగానే ఎడ్లపై రంగులు చల్లి వాటిలో మరింత ఉత్సాహాన్ని నింపారు. గమ్యం దగ్గరపడుతున్న కొద్దీ జనం కేరింతలు కొడుతూ వాటి వెంటే పరుగెత్తసాగారు.

దుమ్ముతో నిండిపోయిన ఆ మైదానంలో, కేవలం పదకొండున్నర నిమిషాల్లో ‘హెలికాప్టర్ బైజ్యా’ జోడెడ్లు లక్ష్యాన్ని చేరుకుని మొదటి స్థానంలో నిలిచాయి. విజేతగా నిలిచిన ఈ ఎడ్లకు అత్యంత ఖరీదైన ‘ఫార్చ్యూనర్’ (Fortuner) కారును బహుమతిగా అందజేశారు.

ఈ పేరు వెనుక కథేంటి? మహారాష్ట్రలోని సాంగ్లీ జిల్లా బోర్గావ్‌లో జరిగిన దేశంలోనే అతిపెద్ద ఎడ్లబండి పందెంలో ఈ అద్భుతం జరిగింది. ఈ జోడిలో ఒక ఎద్దు కర్ణాటకలోని బెళగావి జిల్లా అథణి తాలూకా శిరూర్ గ్రామానికి చెందినది. దీనికి ‘హెలికాప్టర్ బైజ్యా’ అని పేరు పెట్టడానికి ఒక కారణం ఉంది. హెలికాప్టర్ ల్యాండ్ అవుతున్నప్పుడు లేదా టేకాఫ్ అవుతున్నప్పుడు చుట్టూ దుమ్ము ఎలా లేస్తుందో, ఈ ఎద్దు పరుగెత్తడం మొదలుపెడితే మైదానమంతా అలా దుమ్ముతో నిండిపోతుందట. అందుకే అభిమానులు దీనికి ఆ పేరు పెట్టారు.

రూ. 2 కోట్ల విలువైన బహుమతులు! రైతు బాలు హజారేకు చెందిన ఈ ఖిలారీ జాతి ఎద్దుకు ఇప్పుడు 8 ఏళ్లు. ఇప్పటివరకు ఇది 100కు పైగా పందెాల్లో గెలిచింది. దీని విజయాల జాబితాలో బుల్లెట్ బైకులు, ట్రాక్టర్లు, వెండి గదలు, నగదు బహుమతులు ఉన్నాయి. ఇప్పటివరకు ఇది గెలుచుకున్న మొత్తం బహుమతుల విలువ దాదాపు రూ. 2 కోట్లు!

కన్నబిడ్డలా సంరక్షణ: “నాలుగేళ్ల క్రితం దీనిని రూ. 6.5 లక్షలకు కొన్నాను. దీనికి మేతతో పాటు ప్రత్యేకమైన దాణా ఇస్తాము. వ్యాయామం కోసం నాగలి దున్నిస్తాం. అనారోగ్యం వస్తే వెంటనే వైద్యులను పిలిపిస్తాం. మా ఇంట్లోని బిడ్డలా దీనిని చూసుకుంటాం. ప్రస్తుతం ఈ ఎద్దు విలువ రూ. 1 కోటి పైనే ఉంటుంది” అని యజమాని బాలు హజారే గర్వంగా చెబుతున్నారు.

దేశం దృష్టిని ఆకర్షించిన పందెం: సాంగ్లీలో జరిగిన ఈ పోటీలకు దేశవ్యాప్తంగా 1,200 ఎడ్ల జోడీలు వచ్చాయి. సుమారు 700 ఎకరాల విస్తీర్ణంలో ఈ పోటీలను నిర్వహించారు. విజేతలకు రెండు ఫార్చ్యూనర్ కార్లు, థార్ జీపులు, 7 ట్రాక్టర్లు, 150కి పైగా బైకులు బహుమతిగా ఇచ్చారు. వచ్చే ఏడాది విజేతలకు ఏకంగా ‘BMW కారు’ బహుమతిగా ఇవ్వాలని నిర్వాహకులు యోచిస్తున్నారు.


Posted

in

by

Tags: