మన చుట్టుపక్కల ఎవరైనా ఆవలిస్తే, వారిని చూసి మనకూ అనుకోకుండానే ఆవలింత రావడం మనలో చాలామంది గమనించే ఉంటాం.
ఇది కేవలం నీరసం లేదా నిద్రమత్తు వల్ల మాత్రమే జరిగేది కాదు. నిజానికి, మనుషులు ఆవలించడం వెనుక ఒక ముఖ్యమైన శాస్త్రీయ కారణం ఉంది.
ఆవలింత అనేది మన మెదడు తనను తాను చల్లబరుచుకోవడానికి (కూల్ చేసుకోవడానికి) చేసే ఒక సహజసిద్ధమైన ప్రక్రియ. ముఖ్యంగా, ఎండాకాలంలో మెదడు ఉష్ణోగ్రత పెరిగినప్పుడు మనకు ఎక్కువగా ఆవలింతలు వస్తుంటాయి. మనం ఆవలించినప్పుడు ఊపిరితిత్తుల్లోకి ఎక్కువ మోతాదులో ఆక్సిజన్ చేరి, రక్తప్రసరణ మెరుగై మెదడు చల్లబడి తిరిగి ఉత్తేజితమవుతుంది.
అలసట లేదా నిద్ర వచ్చినప్పుడు, మెదడును తిరిగి రీఫ్రెష్ చేసి చురుగ్గా ఉంచేందుకు శరీరమే స్వయంగా చేసుకునే ఒక సహజ ప్రయత్నమే ఈ ఆవలింత. అయితే, ఇతరులు ఆవలించడం చూసినప్పుడు మనకు కూడా ఎందుకు ఆవలింత వస్తుందనే సందేహం చాలామందిలో ఉంటుంది.
ఎదుటివారు ఆవలించినప్పుడు మనకూ ఆవలింత రావడానికి ‘ఎంపతీ’ (Empathy – ఇతరుల భావాలను అర్థం చేసుకుని స్పందించే గుణం) ప్రధాన కారణమని పరిశోధనలు చెబుతున్నాయి. ఎంపతీ అంటే ఇతరుల మనఃస్థితిని లేదా వారి భావోద్వేగాలను మనం కూడా అనుభూతి చెందగలగడం.
ఎదుటి వ్యక్తి ఆవలించినప్పుడు, వారి స్థితిని తమ మనసులో ప్రతిబింబింపజేసుకునే స్వభావం (ఎంపతీ) ఉన్నవారికి స్వచ్ఛందంగానే ఆవలింత వచ్చేస్తుంది. అదే సమయంలో, ఇతరుల భావోద్వేగాలను అర్థం చేసుకునే స్వభావం తక్కువగా ఉన్నవారికి.. ఎదుటివారు ఎన్నిసార్లు ఆవలించినా దాన్ని చూసి వారికి ఆవలింతలు రాకపోవడం గమనార్హం.

Leave a Reply