జెఫ్రీ ఎప్స్టీన్‌కు చెందిన న్యూ మెక్సికో ఎస్టేట్ ‘జోరో రాంచ్’లో గతంలో జరిగిన ఘోరమైన లైంగిక వేధింపుల గురించి అధికారులు విచారణ కొనసాగిస్తుండగా, తాజాగా పలువురు యువకులపై కూడా అక్కడ అత్యాచారాలు జరిగినట్లు ఆరోపణలు వెలువడ్డాయి.
న్యూ మెక్సికో కాంగ్రెస్ ప్రతినిధి మెలానీ స్టాన్స్‌బరీ ఈ విషయాలను వెల్లడించారు. ఒక బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. అతడిని ఆ 7,500 ఎకరాల ఎస్టేట్‌కు పార్టీ కోసం పిలిచి, అక్కడ మత్తుమందు ఇచ్చి తనపై అత్యాచారం చేశారని, తన కళ్లముందే మరికొంతమంది యువకులపై కూడా అదే విధంగా అఘాయిత్యాలు జరిగాయని వివరించాడు. “ఎప్స్టీన్ మరియు ఘిస్లైన్ మాక్స్వెల్ వరుస నేరగాళ్లు; వారు నిజంగా ‘సూపర్ ప్రిడేటర్స్’ (అతి ప్రమాదకరమైన వేటగాళ్లు)” అని ఆమె పేర్కొన్నారు.
బయటపడుతున్న భయంకరమైన నిజాలు:
- స్థానిక బాధితులు: ఇప్పటివరకు ఈ ఎస్టేట్‌లో కేవలం విదేశీయులే బాధితులుగా ఉన్నారని భావించగా, ఇప్పుడు న్యూ మెక్సికోకు చెందిన స్థానిక మహిళలు, బాలికలు కూడా తమపై జరిగిన దాడుల గురించి ఫిర్యాదు చేయడానికి ముందుకు వస్తున్నారు.
- మృతదేహాల ఆరోపణ: ఒక మాజీ ఉద్యోగి అందించిన సమాచారం ప్రకారం.. ఇద్దరు విదేశీ అమ్మాయిల మృతదేహాలను ఎస్టేట్ సమీపంలోని కొండల్లో పాతిపెట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి. దీనిపై ‘ట్రూత్ కమిషన్’ ప్రస్తుతం విచారణ జరుపుతోంది.
- భయంకరమైన అనుభవాలు: గతంలో బాధితురాలిగా ఉన్న శాంటె డేవిస్ తన అనుభవాలను వివరిస్తూ.. “ఆ రాంచ్ చాలా నిర్మానుష్యంగా, పాడుబడ్డ చోటులా ఉంటుంది. మీరు ఎంత గట్టిగా అరిచినా ఎవరికీ వినిపించదు. అక్కడి రూమ్స్‌లో ఉన్నప్పుడు ఏదో ఎలుక బోనులో చిక్కుకున్నట్లుగా ఉండేది” అని ఆవేదన వ్యక్తం చేశారు.
- వింత ప్రయోగాలు: అక్కడ ‘పర్ఫెక్ట్ బేబీ’ని సృష్టించడం లేదా అత్యుత్తమ జన్యువుల కోసం వేట (Gene pool hunt) వంటి వింతైన చర్చలు జరిగేవని ఆమె గుర్తు చేసుకున్నారు.
విచారణ ఎందుకు ఆలస్యమైంది? 2019లో ఫెడరల్ ప్రాసిక్యూటర్ల అభ్యర్థన మేరకు న్యూ మెక్సికో రాష్ట్రం ఈ విచారణను నిలిపివేసింది. అయితే, అమెరికా న్యాయశాఖ ఎప్స్టీన్‌కు సంబంధించిన లక్షలాది ఫైళ్లను విడుదల చేయడంతో, ఫిబ్రవరిలో ఈ కేసును మళ్లీ రీ-ఓపెన్ చేశారు. బాధితులకు న్యాయం చేయడమే కాకుండా, ఎప్స్టీన్ సహచరులపై నేరారోపణలు చేయడానికి అధికారులు కృషి చేస్తున్నారు.
