బెంగళూరు: నగరంలో ప్రస్తుతం నెలకొన్న భారీ ట్రాఫిక్ సమస్యలు మరికొన్ని నెలలు లేదా ఏళ్లలో తగ్గుముఖం పట్టనున్నాయి. ఎందుకంటే బెంగళూరు గగనతలంలో ఇకపై ఫ్లయింగ్ టాక్సీలు (Flying Taxis) సందడి చేయనున్నాయి. గత కొంతకాలంగా ఈ విషయంపై చర్చ జరుగుతుండగా, తాజాగా దీనికి సంబంధించిన పనులు నిశ్శబ్దంగా వేగవంతం అయ్యాయి.
బెంగళూరుకు చెందిన సర్లా ఏవియేషన్ (Sarla Aviation) సంస్థ అభివృద్ధి చేసిన విద్యుత్ ఆధారిత వర్టికల్ టేక్-ఆఫ్ మరియు ల్యాండింగ్ (eVTOL) విమానం SYL-X1 కు సంబంధించి గ్రౌండ్ టెస్టింగ్ పరీక్షలు నిర్వహించారు.
ముఖ్య విశేషాలు:
- అతిపెద్ద ప్రైవేట్ ఎయిర్ టాక్సీ: 7.5 మీటర్ల రెక్కల వెడల్పుతో (wingspan), SYL-X1 ప్రస్తుతం భారతదేశంలో అభివృద్ధి చేయబడుతున్న అతిపెద్ద మరియు అత్యంత అధునాతన ప్రైవేట్ eVTOL ప్రోటోటైప్.
- తక్కువ ఖర్చు – వేగవంతమైన అభివృద్ధి: కేవలం తొమ్మిది నెలల వ్యవధిలో, ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి ప్రాజెక్టులకు అయ్యే ఖర్చులో కేవలం కొంత భాగంతోనే దీన్ని నిర్మించారు.
- భద్రత మరియు టెక్నాలజీ: ఇది కేవలం చిన్న మోడల్ కాదు, భవిష్యత్తులో రాబోయే 15 మీటర్ల పూర్తి స్థాయి విమానానికి ఇది పునాది. స్ట్రక్చరల్ బిహేవియర్, ప్రొపల్షన్ ఇంటిగ్రేషన్ మరియు సిస్టమ్ లెవల్ సేఫ్టీ వంటి అంశాలను పరీక్షించడానికి దీన్ని డిజైన్ చేశారు.
- ప్రయాణ సమయం ఆదా: సర్లా ఏవియేషన్ ప్రధానంగా ఆరు సీట్ల ఎలక్ట్రిక్ ఫ్లయింగ్ టాక్సీని రూపొందిస్తోంది. ఇది బెంగళూరు, ముంబై, ఢిల్లీ మరియు పూణే వంటి రద్దీ నగరాల్లో ప్రయాణ సమయాన్ని భారీగా తగ్గిస్తుంది.
విమానాశ్రయంతో భాగస్వామ్యం: బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయ లిమిటెడ్ (BIAL) ఇప్పటికే సర్లా ఏవియేషన్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. దీని ద్వారా కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి నగరంలోని వివిధ ప్రాంతాలకు ఎయిర్ టాక్సీ సేవలను ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
