ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థి సంఘం ఎన్నికల ప్రచారంలో చెలరేగిన హింసాత్మక ఘటనల నేపథ్యంలో, గెలుపు విజయోత్సవ ర్యాలీలపై హైకోర్టు కఠిన నిషేధం విధించింది.
ఎన్నికల ప్రచారం సందర్భంగా పలు ప్రాంతాల్లో ఘర్షణలు, గొడవలు జరిగాయని ఫిర్యాదులు వెల్లువెత్తాయి. దీనికి సంబంధించిన పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయస్థానం, ఎన్నికల ఫలితాల అనంతరం ఎలాంటి విజయోత్సవ ర్యాలీలు నిర్వహించకూడదని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే ఎన్నికల భద్రతా ఏర్పాట్లపై పలు మార్గదర్శకాలు ఇచ్చినప్పటికీ, మళ్లీ ఇలాంటి హింసాత్మక ఘటనలు చోటుచేసుకోవడం పట్ల హైకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.
విచారణ సందర్భంగా.. భారీగా పోలీసు బలగాలను భద్రత కోసం మోహరించినప్పటికీ ఈ హింస ఎలా జరిగిందని కోర్టు ప్రశ్నించింది. ముఖ్యంగా, నంబర్ ప్లేట్లు లేని వాహనాలు, అభ్యర్థుల పేర్లు లేని వాహనాలను యూనివర్సిటీ క్యాంపస్‌లోకి ఎలా అనుమతించారని పోలీసులను నిలదీసింది. అనేక వాహనాలు కాన్వాయ్‌లా వెళ్లిన దృశ్యాలు తమ దృష్టికి వచ్చాయని పేర్కొన్న కోర్టు, వాటిని అడ్డుకోవడానికి ఎలాంటి చర్యలు తీసుకున్నారని వివరణ కోరింది. ఇటువంటి వాహన ర్యాలీలు క్యాంపస్‌లో భయాందోళనలు, తీవ్ర ఉత్కంఠను రేకెత్తిస్తాయని స్పష్టం చేసింది. దీనిపై స్పందించిన పోలీసులు, వాహనాల తనిఖీలను నిరంతరం కొనసాగిస్తున్నామని కోర్టుకు తెలిపారు.
అంతేకాకుండా, కొందరు అభ్యర్థులు వాహనాల టాప్‌లపై, బోనెట్లపై నిలబడి ప్రచారం చేసిన దృశ్యాలపై కూడా కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలాంటి నిబంధనల ఉల్లంఘనలను ఎలా అనుమతించారని పోలీసులను వివరణ అడిగింది. ప్రచారంలో జరిగిన హింసపై వివిధ వర్గాల నుంచి నివేదికలు కోరిన తరుణంలో ఈ విచారణ కొనసాగింది. అవసరమైతే ఓట్ల లెక్కింపును, ఫలితాల ప్రకటనను కూడా నిలిపివేయాల్సి వస్తుందని కోర్టు ఇప్పటికే హెచ్చరించింది. దీంతో ఎన్నికల నిర్వహణలో భద్రతా నిబంధనలను అత్యంత కఠినంగా అమలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.
కేసు విచారణ సమయంలో.. గతేడాదే ఎన్నికలకు సంబంధించి కోర్టు కొన్ని స్పష్టమైన మార్గదర్శకాలను జారీ చేసిందని పిటిషనర్ తరఫు న్యాయవాది గుర్తుచేశారు. అయినప్పటికీ, ఇటీవల జరిగిన ప్రచారంలో కొందరు అభ్యర్థులతో కలిసి కొందరు వ్యక్తులు అల్లర్లకు పాల్పడ్డారని, ఘర్షణలు సృష్టించారని ఆరోపించారు. అంతేకాకుండా, కొందరి వద్ద తుపాకులు తదితర ఆయుధాలు కూడా ఉన్నాయని పిటిషనర్ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఎన్నికల సంబంధిత హింసను అరికట్టడానికి, శాంతిభద్రతలను పరిరక్షించడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని కోర్టు ఆదేశించింది. ఇందులో భాగంగానే విజయ ఊరేగింపులపై (విజయోత్సవ ర్యాలీలపై) సంపూర్ణ నిషేధం విధించింది.

Leave a Reply